పిల్లలమర్రికి అందగత్తెలు .. ఊడల మర్రి చెట్టును విజిట్ చేయనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

పిల్లలమర్రికి అందగత్తెలు .. ఊడల మర్రి చెట్టును విజిట్ చేయనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
  • అమెరికాకు చెందిన 22 మంది రాక
  • సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శన
  • ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
  • 1,000 మంది పోలీసులతో భద్రత

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్​జిల్లా పిల్లలమర్రిలోని మహా వృక్షానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మిస్​వరల్డ్–-2025 పోటీలను వేదికగా మలుచుకుంటోంది. హైదరాబాద్​లో జరుగుతున్న ఈ పోటీలకు దాదాపు వందకు పైగా దేశాల నుంచి కంటెస్టెంట్స్​వచ్చారు. వీరిని గ్రూప్–-1, గ్రూప్–-2గా డివైడ్​చేసి, రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రత్యేక థీమ్స్​, టూరిస్ట్​ సర్క్యూట్ లలో తిప్పనుంది. 

అక్కడి విశేషాలను, గొప్పదనాన్ని వారికి వివరించనున్నారు. తద్వారా తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజేయనున్నారు. ఈ టూరిస్ట్​సర్క్యూట్​లో హైదరాబాద్​కు సమీపంలోని పిల్లలమర్రికి కూడా ప్రభుత్వం చోటు కల్పించింది. ఈ నెల 16న గ్రూప్–-2లో ఉన్న అమెరికాకు చెందిన 22 మంది కంటెస్టెంట్లును ఇక్కడి ఊడల మర్రి చెట్టును సందర్శించనున్నారు. 

చకచకా ఏర్పాట్లు..

అందగత్తెల పర్యటన నేపథ్యంలో పిల్లలమర్రిలో ఆర్కియాలజీ, ఫారెస్ట్, టూరిజం శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఊడల మర్రి ఉన్న ప్రాంతం చుట్టూ గ్రాస్​మ్యాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. మహా వృక్షం చుట్టూ ఉన్న గోడలు, కుర్చీలు, ఊడల మర్రికి సపోర్ట్​గా ఏర్పాటు చేసిన సిమెంట్​పిల్లర్లకు రంగులు వేస్తున్నారు. అక్కడక్కడ దెబ్బతిన్న గోడలకు ప్యాచ్ వర్క్​లు చేస్తున్నారు. మిస్​వరల్డ్​కంటెస్టెంట్లు ఇక్కడి శివాలయాన్ని కూడా సందర్శించనున్నారు. దీంతో చుట్టూ పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సేదతీరేందుకు వాటర్​ప్రూఫ్​టెంట్లు వేస్తున్నారు. మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం​చేస్తున్నారు. కొన్ని శిలల వద్ద అవి ఏ కాలానికి చెందినవో వివరాలు లేకపోవడంతో  సంబంధిత​ బోర్డులు రాయిస్తున్నారు.

ఊడల మర్రి చరిత్ర ఇదీ..

పిల్లలమర్రిలోని మర్రి చెట్టు 4 ఎకరాల్లో విస్తరించింది. దీనికి 700 ఏండ్ల చరిత్ర ఉంది. చెట్టు ఊడలు నేలకు తాకితేనే అవి భూమిలోకి పోయి మహావృక్షం ఎదుగుతుంది. పర్యాటకులు ఊడలమర్రి కొమ్మలపైకి ఎక్కుతూ వాటిపై చెక్కడం, చిన్న చిన్న ఊడలను విరిచేయడం చేశారు. అలాగే, ఈ మహావృక్షంపై పెస్ట్​ అటాక్​ కావడంతో కొమ్మలు విరిగిపోతూ వచ్చాయి. చెదలు కూడా పట్టి చెట్టు కూలే స్థితికి చేరుకోవడంతో 2018 సెప్టెంబర్​నుంచి పిల్లలమర్రికి సందర్శకులను నిలిపివేశారు. ఈ వృక్షం సంరక్షణను టూరిజం శాఖ చూస్తుండగా, మహబూబ్​నగర్​ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు​ మర్రిచెట్టు పునరుజ్జీవం బాధ్యత అప్పగించారు. 

మొదట చెదల నివారణపై ఫోకస్ పెట్టి, పురుగు మందులతో సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. కొన్ని నెలలపాటు ఈ చికిత్స అందించి, చెదలు పట్టిన కొమ్మలను తీయడంతో.. మహావృక్షం నుంచి చిన్న చిన్న ఊడలు రావడం ప్రారంభమైంది. వాటికి పైపులు ఏర్పాటు చేశారు. ఊడలకు వెలుతురు తగిలేలా పైపులకు రంధ్రాలు పెట్టారు. ఊడలు వృక్షానికి ఆసరాగా నిలిచాయి. దీంతో గతేడాది జూన్ నుంచి సందర్శనలకు అనుమతి ఇచ్చారు. కానీ ఎవరూ చెట్టు వద్దకు వెళ్లకుండా 5 ఫీట్ల ఎత్తున్న ఫెన్సింగ్స్ వేశారు. దాన్ని దాటి కొమ్మలను ముట్టుకున్నా, ఆకులు తెంపినా రూ.5 వేల ఫైన్​ విధిస్తామని ప్రకటించారు.

2 గంటల సందర్శన

మిస్​వరల్డ్​కంటెస్టెంట్లు ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గాన పిల్లలమర్రికి చేరుకుంటారు. ముందుగా శివాలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మ్యూజియంకు చేరుకొని, పురాతన శిలలను పరిశీలిస్తారు. అనంతరం మహా వృక్షాన్ని సందర్శించి, దాని విశిష్టతను తెలుసుకుంటారు. వీరి రాక సందర్భంగా 1,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తుతోపాటు లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ, లంబాడా నృత్యాలను ప్రదర్శించనున్నారు. కంటెస్టెంట్లు రాత్రి 7 గంటలకు తిరిగి రోడ్డు మార్గానా హైదరాబాద్​వెళ్లనున్నట్లు తెలిసింది.