అంత పెద్దోళ్లు మీరు.. : మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో డాబర్ గ్రూప్ చైర్మన్

అంత పెద్దోళ్లు మీరు.. : మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో డాబర్ గ్రూప్ చైర్మన్

ఎంతటి వారైనా.. ఎంత పెద్దోళ్లు అయినా.. ఎన్ని లక్షల కోట్లు ఉన్నా.. మజా.. కిక్కు అనేది ఉండాలి కదా.. అది లేకపోతే ఎంత సంపాదించి ఏం లాభం.. అందుకే చాలా పెద్దపెద్దోళ్లు.. డబ్బున్నోళ్లు అందరూ కిక్కు కోసం బెట్టింగ్స్, గేమ్స్.. ఇతర వ్యవహారాల్లోనూ ఉంటారు.. అలాంటిదే ఇప్పుడు వెలుగు చూసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో.. డాబర్ గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ పేర్లు బయటకు రావటం.. వ్యాపార ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది.

మహాదేవ్ యాప్ బెట్టింగ్ కుంభకోణంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల తర్వాత పారిశ్రామికవేత్తలు - డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ వి. బర్మన్, డైరెక్టర్ గౌరవ్ వి. బర్మన్ పేర్లు కూడా ముంబై పోలీసుల విచారణలో ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. నవంబర్ 7న ముంబై పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్ యాప్ ఎఫ్‌ఐఆర్‌లో ప్రముఖ ఆయుర్వేద దిగ్గజం డాబర్ గ్రూప్‌కు చెందిన బర్మన్ ల పేర్లు చేర్చబడ్డాయి. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌తో పాటు ఇతర వ్యక్తులతో సహా మొత్తం 31 మంది నిందితులలో వీరూ ఉన్నారు. డాబర్ గ్రూప్ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అధికారులెవరూ దీనిపై మాట్లాడేందుకు అందుబాటులో లేరు.

బెట్టింగ్ యాప్ ద్వారా వేలాది మందిని రూ. 15వేలకు కోట్లకు పైగా మోసం చేశారని సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ మాతుంగా పోలీసులకు మొదటి ఫిర్యాదు చేశారు. గ్యాంబ్లింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నప్పటికీ.. ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.