తెలంగాణలో ఇయాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ జర్నీ

తెలంగాణలో ఇయాళ్టి నుంచే  మహిళలకు ఫ్రీ జర్నీ
  • అసెంబ్లీ వద్ద  ‘మహాలక్ష్మి’ స్కీమ్​ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 
  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వర్తింపు  
  • స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజ్​ చేసిన రవాణా శాఖ 
  • ప్రతిరోజూ 14 లక్షల మంది మహిళల ప్రయాణం: సజ్జనార్ 
  • పీక్ హవర్స్​లో మగవాళ్లకు స్పెషల్ బస్సులు 
  • సర్కార్ నుంచి ఆర్టీసీకి ఏటా రూ.3 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టవ్యాప్తంగా మహిళలకు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘మహాలక్ష్మి’ స్కీమ్ శనివారం నుంచి అమలు కానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారిలకు ఫ్రీ టికెట్ ఇచ్చి స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు.

ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ను వివరిస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ జీవో జారీ చేశారు. మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్లు అయినా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ఈ స్కీమ్ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్ లో శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అధికార పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఉచిత జర్నీ స్కీమ్ ఒకటని.. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం, మంత్రులు, సీఎస్ తో పాటు ఇంటర్ననేషనల్ ప్లేయర్ నికత్ జరీన్ పాల్గొంటారని ఆయన తెలిపారు. 

స్కీమ్ అమలుకు 7,200 బస్సులు 

ప్రస్తుతం రోజూ సుమారు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. నాలుగైదు రోజులు గడిస్తే రోజూ ఎంత మంది మహిళలు జర్నీ చేస్తున్నారనే విషయంలో కచ్చితమైన లెక్కలు వస్తాయన్నారు. ప్రస్తుతం రోజువారీ జర్నీలో 40 శాతం మహిళలు ఉన్నారని, స్కీమ్ అమలు తర్వాత ఇది 55 శాతానికి పెరగొచ్చన్నారు.

‘‘ఈ స్కీమ్ అమలుకు 7,200 బస్సులను వినియోగిస్తున్నం. దీనిపై అన్ని డిపోల మేనేజర్లు, ఆర్ఎంలకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ర్ట సరిహద్దు వరకే ఈ ఫ్రీ జర్నీ వర్తిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు అయినా జర్నీ చేయొచ్చు. ఫ్రీ టికెట్ ఇచ్చేముందు స్థానికతను తెలియజేసే ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది” అని సజ్జనార్ వివరించారు. స్కీమ్ పై అవగాహన కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, శుక్రవారం జూమ్ ద్వారా 30 వేల మంది కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడామన్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని, ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.
 
ఏటా రూ. 3 వేల కోట్లు.. 

మహాలక్ష్మి స్కీమ్ అమలు ద్వారా ఏడాదికి రూ. 3 వేల కోట్ల భారం పడుతుందని, ఈ నిధులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ రూపంలో ఇస్తుందని సజ్జనార్ చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజూ రూ.14 కోట్ల రెవెన్యూ వస్తుండగా, ఈ స్కీమ్ అమలు తర్వాత డైలీ రెవెన్యూ రూ.7 కోట్లకు తగ్గుతుందన్నారు. త్వరలో 1,000 కొత్త బస్సులు వస్తున్నాయని, రూరల్ ప్రాంతాలకు 500 కేటాయిస్తామన్నారు. కరోనా తర్వాత ప్రైవేట్ వెహికల్స్ పెరగడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, ఆర్టీసీలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందన్నారు.   

బకాయిలు వసూలు చేస్తున్నం  

ఆర్మూర్​లో మల్టిప్లెక్స్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీకి రూ. 7.5 కోట్లు బకాయిపడ్డారని సజ్జనార్ తెలిపారు. బకాయిలపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, ఇందులో రూ. 1.5 కోట్లు చెల్లించారని వెల్లడించారు. త్వరలో మరో రూ. కోటిన్నర చెల్లిస్తామని తెలిపారని వెల్లడించారు. వరంగల్ లో కూడా ఓ ఎంపీ ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకొని నిర్మించిన మల్టిప్లెక్స్ లో రూ.40 లక్షల బకాయిలు ఉండగా నోటీసులు ఇచ్చామన్నారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ బకాయిలు ఉన్న దగ్గర నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. 

మగవాళ్లకు స్పెషల్ బస్సులు 

ఫ్రీ జర్నీ స్కీమ్ అమలు తర్వాత మహిళలు బస్సుల్లో సీట్లు ఆక్యుపై చేస్తే ఎలా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎండీ సజ్జనార్ స్పందించారు. పీక్ హవర్స్ లో బస్సులు మహిళలతో ఫుల్ అయితే జంట్స్ కు స్పెషల్ బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికే స్కూల్ విద్యార్థినులు తీసుకున్న బస్ పాస్ పైసలు వెనక్కి ఇవ్వబోమని, వచ్చే నెల నుంచి పాస్ లు తీసుకోకుండా ఈ స్కీమ్ లో భాగంగా జర్నీ చేయాలని ఆయన సూచించారు. 

మహాలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్ ఇవే.. 

 

  • ఫ్రీ జర్నీకి బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు అర్హులు 
  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే స్కీమ్ వర్తింపు 
  • ఫ్రీ టికెట్ కు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులలో ఏదో ఒకటి చూపాలి 
  • రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ఫ్రీ 
  • రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే పథకం వర్తింపు