బైక్ కొనేందుకు పైసల కోసం.. సెల్ ఫోన్ స్నాచింగ్ లు

బైక్ కొనేందుకు పైసల కోసం.. సెల్ ఫోన్ స్నాచింగ్ లు
  • మైనర్ తో కలిసి చోరీలు చేస్తున్న యువకుడు అరెస్ట్
  • రూ.3 లక్షల 50 వేల విలువైన 9 సెల్ ఫోన్లు స్వాధీనం 

సికింద్రాబాద్, వెలుగు: బైక్ కొనుక్కునేందుకు డబ్బుల కోసం మైనర్ తో కలిసి సెల్ ఫోన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న యువకుడిని మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లోని నార్త్ జోన్ డీసీపీ ఆఫీసులో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. మియాపూర్ లోని మాతృశ్రీనగర్ లో ఉండే కట్టమూరి కృష్ణ అలియాస్ కిట్టు(23) ఉపాధి కోసం తన ఫ్రెండ్ బైక్ ను తీసుకుని.. ర్యాపిడో రైడర్ గా పనిచేస్తున్నాడు. అయితే, సొంతంగా బైక్ కొనుక్కోవాలని కృష్ణ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం డబ్బులు జమ చేయాలనుకున్నాడు. 

ర్యాపిడో రైడ్స్ లో వచ్చే సంపాదన సరిపోకపోవడంతో సెల్ ఫోన్ స్నాచింగ్ లకు స్కెచ్ వేశాడు. తన ఇంటికి దగ్గరలో ఉండే మైనర్ కు ఈ విషయం చెప్పి తనకు సహకరిస్తే  సెల్ ఫోన్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇద్దరు కలిసి బైక్ పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి సెల్ ఫోన్లను కొట్టేయడం మొదలుపెట్టారు. ఇలా దొంగిలించిన ఫోన్లను వేరే ప్రాంతాల్లో తక్కువ రేటుకు అమ్మేవారు. కొన్ని సెల్ ఫోన్లను ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. ఇటీవల మహంకాళి పీఎస్ పరిధిలో సెల్ ఫోన్ పొగొట్టుకున్న ఓ వ్యక్తి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రద్దీ ఏరియాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 

మహంకాళి పీఎస్ పరిధిలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు పలుచోట్ల అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గుర్తించిన పోలీసులు నిఘా పెంచారు. బుధవారం కృష్ణతో పాటు మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు.  మహంకాళి, గచ్చిబౌలి, బాచుపల్లి, మధురానగర్, మాదాపూర్, మల్కాజిగిరి పీఎస్ ల పరిధిలో నిందితులు కొట్టేసిన 9 సెల్ ఫోన్లను, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షల 50 వేలు ఉంటుందన్నారు. మైనర్​ను జువైనల్ హోమ్​కు, కృష్ణను రిమాండ్​కు తరలించామన్నారు.