
అమ్మాయి వేషధారణలో నైటీ డ్రెస్ ధరించి దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే. ఓ మొబైల్ దుకాణంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు యాకయ్య. అయితే డబ్బు మీద ఉన్న ఆశతో పనిచేస్తున్న షాపులోనే దొంగతనానికి పాల్పడాలని అనుకున్నాడు. దుకాణంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని యాకయ్య ఆసరాగా తీసుకున్నాడు.
పోలీసులకు అనుమానం రాకూడదని అమ్మాయి వేషధారణలో నైటీ డ్రెస్ ధరించి దొంగతనానికి వెళ్లాడు. అయితే దొంగతనం చేసిన మరుసటి రోజున లీవ్ పెట్టి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లోని తన స్వగ్రామానికి వెళ్లాడు. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో యాకయ్యను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు.
పోలీసుల విచారణలో తానే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా యాకయ్య ఒప్పుకున్నాడు. అతని నుండి 8 లక్షల విలువైన సెల్ ఫోన్లను పోలీసులుస్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద యాకయ్యపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.