మాకు నష్టం లేకుంటే ఎత్తు పెంపునకు ఓకే! తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హామీ

మాకు నష్టం లేకుంటే  ఎత్తు పెంపునకు ఓకే! తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హామీ
  • 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తామని వెల్లడి
  • ముంబైలో దేవేంద్ర ఫడ్నవీస్‌‌తో సీఎం రేవంత్‌‌ బృందం భేటీ
  • ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలతో కమిటీ
  • రోడ్‌‌మ్యాప్‌‌,  బ్యారేజీ నిర్మాణ స్థలం, వివిధ ఎత్తుల్లో 
  • ముంపు ప్రభావంపై అధ్యయనం చేస్తామన్న మహారాష్ట్ర
  • తుమ్మిడిహెట్టి.. సరిహద్దు ప్రజల మైత్రి వారధి: సీఎం రేవంత్ 
  • ముంపు భూములకు మహారాష్ట్ర చట్టాల ప్రకారమే పరిహారమిస్తం
  • 152 మీటర్లతోనే ఆదిలాబాద్‌‌కు గ్రావిటీ ద్వారా నీళ్లు: మంత్రి ఉత్తమ్​

 


 

 హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు అనుమతివ్వాలన్న తెలంగాణ సర్కారు అభ్యర్థనపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు, భూములకు ఎలాంటి నష్టం లేకపోతే 2016 నాటి 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర  సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ఉన్నత స్థాయి బృందం తుమ్మిడిహెట్టిపై సోమవారం విస్తృతంగా చర్చలు జరిపింది.

ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్‌‌ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే మహారాష్ట్ర భూములకు ఆ రాష్ట్ర నిబంధనల మేరకే నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు ప్రతిపాదనపై కీలక ముందడుగు పడినట్లయింది. 

152 మీటర్లే పరిష్కారం: ఉత్తమ్​

తుమ్మిడిహెట్టిపై  మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి సమగ్ర వివరాలతో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని, అక్కడి గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు.  

ఆ ప్రాంతానికి నీళ్లందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్.బి.చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి నేటివరకు సాగిన ప్రయాణాన్ని గుర్తుచేశారు. 5 దశాబ్దాలుగా ఎన్నో చర్చలు, ప్రతిపాదనలు వచ్చినా క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఆర్థిక అవకాశాలు లేక, సాగునీరు అందక తీవ్ర వెనుకబాటుకు గురైన ఆ ప్రాంతంలో గతంలో నక్సలిజం విస్తరించిన పరిస్థితులను వివరించారు. 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకే పరిమితం చేస్తే.. తెలంగాణలోని తాగు, సాగునీటి అవసరాలు ఏమాత్రం తీరవని నివేదికల ద్వారా ఉత్తమ్​ స్పష్టం చేశారు. లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోయడం వల్ల భారీ విద్యుత్ వ్యయం, నిర్వహణ భారం పెరుగుతాయని,  పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా అది సరికాదన్నారు. గ్రావిటీ ద్వారా సహజ ప్రవాహంతో నీటిని తరలించాలంటే బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడమే ఏకైక పరిష్కారమని వివరించారు. మహారాష్ట్రలో మునిగే భూములకు ఆ రాష్ట్ర చట్టాల ప్రకారమే పూర్తి పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

పెద్ద మనసుతో సహకరించండి: సీఎం రేవంత్​

పూర్వ హైదరాబాద్ సంస్థానం  నుంచే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పేగుబంధం లాంటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా అటవీ ప్రాంతమని, అక్కడి గిరిజనులు, ఆదివాసీల చిరకాల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉందని అన్నారు. నిజాం కాలంలోనే విప్లవ వీరుడు కుమ్రం భీమ్ సాగించిన ‘జల్, జంగిల్, జమీన్’ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రజలు సాగునీరు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. వారి ఆకాంక్షలు దశాబ్దాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయాయని, ఆ గిరిజనుల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపేందుకే తాము ఈ ప్రతిపాదనతో వచ్చామని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ అనేది కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదని, ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రజల అనుబంధాన్ని భౌతికంగా అనుసంధానించే మైత్రీ వారధి అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు మేలు చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్దమనసుతో, సోదరభావంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయం (డిఫెన్స్ అండ్ సివిల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్) అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు ఏర్పాటుతో ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌కే కాకుండా, పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలకు సైతం  ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ బలోపేతంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజల విస్తృత ప్రయోజనాలు, జాతి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్ర తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

తెలంగాణకు సహకరిస్తం: ఫడ్నవీస్​

తెలంగాణ బృందం ప్రతిపాదనలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో, ముఖ్యంగా సరిహద్దు ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన అమ్మమ్మ స్వయంగా తెలుగు మాట్లాడేవారని  గుర్తుచేసుకున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తును 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను పరిశీలించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మహారాష్ట్ర వైపు ఉన్న వ్యవసాయ భూములు, గ్రామాలపై ప్రతికూల ప్రభావం లేకుండా చూస్తే, గతంలో చేసుకున్న 148 మీటర్ల ఒప్పందాన్ని తిరగరాసేందుకు (పునఃపరిశీలించేందుకు) సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న అనేక అంతర్రాష్ట్ర జల వివాదాలను మహారాష్ట్ర గతంలో చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకున్నదని గుర్తుచేశారు. అదే  స్ఫూర్తితో తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు ముందుకొస్తామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రతిపాదన పట్ల గతంలోనూ మహారాష్ట్ర సానుకూల వైఖరి అనుసరించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం బ్యారేజీ ఎత్తు పెంపుపై తెలంగాణ చేసిన అభ్యర్థనను పరిశీలించేందుకు స్వతంత్ర అధ్యయనం చేపట్టనున్నట్టు తెలిపారు. బ్యారేజీ నిర్మాణ స్థలం, వివిధ ఎత్తుల వద్ద ముంపు ప్రభావం, అవసరమైన భూమి విస్తీర్ణాన్ని పరిశీలిస్తారని చెప్పారు. మహారాష్ట్ర అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలు, అంచనాలపై తెలంగాణకు అభ్యంతరాలు ఉంటే రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి పరిశీలిస్తారన్నారు. అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. వాస్తవాలు, సాంకేతిక అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

  ‘ఇన్వెస్ట్ తెలంగాణ     గ్లోబల్ సమిట్’కు ఆహ్వానం

హైదరాబాద్ శివార్లలోని ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’కు రావాలని దేవేంద్ర ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. సదస్సుకు హాజరయ్యేందుకు తనకు పూర్తి ఆసక్తి ఉందని, తప్పకుండా పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. దేశంలోనే రెండు బలమైన ఆర్థిక శక్తులుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్రలు పారిశ్రామికంగా, మౌలిక వసతుల కల్పనలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా నలుగుతున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఈ భేటీతో ప్రతిష్టంభన తొలిగిపోయిందని, స్నేహపూర్వక వాతావరణంలో సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడిందని ఇరు రాష్ట్రాల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. 

 అధ్యయనానికి ఉన్నతాధికారుల కమిటీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యయనం చేస్తోందని,  ఈలోగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో ఉన్నతాధికారుల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో నీటి లభ్యత ఎంత ఉంటుంది? మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం ఎంత? ప్రభావితమయ్యే ప్రాంతాలు ఏవి? అనే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు పరస్పరం చర్చించుకొని పరిహారం లెక్కలు, ఇతర ప్రత్యామ్నాయాలపై  నిర్దిష్ట కాలపరిమితో రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ రూపొందించి ప్రభుత్వాలకు నివేదిక సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, గిరిజన పల్లెల అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు.