
నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసాన్ని పేల్చేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆదివారం(ఆగస్టు 3) ఉదయం 8:46 గంటలకు గడ్కరీ ఇంటిని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ తర్వాత పోలీసులు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెదిరింపు వచ్చిన కొద్దిసేపటికే ఉమేష్ విష్ణు రౌత్ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహల్‌లోని తులసి బాగ్ రోడ్‌లో నివసించే రౌత్..మెడికల్ చౌక్ సమీపంలోని ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. అతను తన మొబైల్ ఫోన్ నుండి కాల్ చేసి 10 నిమిషాల్లో గడ్కరీ నివాసాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి నాగ్‌పూర్‌లోని బీమా దవాఖానా సమీపంలో అరెస్టు చేశారు.
ఈ బెదిరింపు సమయంలో నాగ్‌పూర్‌లో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. 112 అత్యవసర హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్ ఆధారంగా బాంబు స్క్వాడ్‌ను అప్రమత్తం చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) జోన్ 1 రిషికేశ్ రెడ్డి చెప్పారు. అయితే దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ కాల్ బూటకమని తేలింది. నిందితుడిపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఈ బెదిరింపు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి భద్రతను పటిష్టం చేశారు.