ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ముందడుగు

ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ముందడుగు

ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని సర్కార్ అన్ని అనుమతులు మంజూరు చేసింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అన్ని క్లియరెన్సులు లభించాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం వెనుకంజ వేసిన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి షిండే అన్ని అనుమతులు ఇచ్చారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో అవసరమైన 70 శాతానికి పైగా భూమిని థానే, పాల్ఘర్ జిల్లాల్లో ఇప్పటికే సేకరించారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పక్కనపెట్టింది. మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో భూసేకరణ జరగకపోవడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమైంది.

2017లో అప్పటి జపాన్ ప్రధాని షింబో అబెతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 508 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ కారిడార్ లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,10,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో రూ. 88,000 కోట్లు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (JICA) ద్వారా నిధులు సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఒకవేళ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

షిండే సర్కార్ పై ఎన్సీపీ సెటైర్లు

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంపై ఏక్‌నాథ్ షిండే సర్కార్ పై ఎన్సీపీ విమర్శలు చేసింది. ముందుగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మరింత దృష్టి పెట్టాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే అన్నారు.