ప్రతిపక్ష నేతలకు భద్రతను తొలగించిన మహా సర్కార్

ప్రతిపక్ష నేతలకు భద్రతను తొలగించిన మహా సర్కార్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కూటమికి చెందిన 25 మంది కీలక నేతలకు భద్రతను తొలగించింది. మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటుగా  ఆయన కుటుంబ సభ్యులకు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే సహా ఇతర కుటుంబ సభ్యులకు భద్రత కొనసాగనుంది.  

గతంలో  హోం మంత్రులుగా పనిచేసిన ఎన్సీపీ నేతలు జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్బల్‌, జైల్లో ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌ల భద్రతను తొలగించింది. అయితే ఉద్ధవ్‌ అనుచరుడు, శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే వర్గం) కార్యదర్శి మిలింద్‌ నర్వేకర్‌కు వై-ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పించడం గమనార్హం.   కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ చవాన్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌లకు వై కేటగిరీ భద్రతను కల్పించారు. 

ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని కూల్చి సీఎం పదవిని చేపట్టిన ఏక్‌నాథ్‌ షిండే ... ఇప్పుడు ప్రతిపక్ష కూటమి నేతలకు భద్రతను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.