ఉల్లిపాయ వ్యాపారుల ధర్నా.. ధరలు భారీగా పెరగనున్నాయా..?

ఉల్లిపాయ వ్యాపారుల ధర్నా.. ధరలు భారీగా పెరగనున్నాయా..?

ఉల్లి.. ఎప్పుడూ ధరల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం.. ఇప్పుడు వ్యవహారం రివర్స్ అయ్యింది. ఉల్లి వ్యాపారులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలపై పోరాటం చేపట్టారు. కేంద్రం దిగి వచ్చే వరకు ధర్నా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉల్లిపాయల లావాదేవీలకు బ్రేక్ పడింది. భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్ ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఉల్లి వ్యాపారుల ధర్నా మరిన్ని రోజులు కొనసాగితే ధరలు అమాంతం పెరగటంతోపాటు.. ఉల్లి రైతులు నష్టపోయే ప్రమాదం లేకపోలేదనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

 Also Read: Good Health : గులాబీ పూల ఛాయ్(టీ).. రోజూ తాగితే జుట్టు బాగా పెరుగుతుందా..!
 

 మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని అన్ని వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలలో వేలం నిలిపివేసినట్లు ఉల్లి వ్యాపారులు తెలిపారు. తమ నిరసన నిరవధికంగా కొనసాగుతుందని, ఈ పరిణామం రిటైల్ మార్కెట్‌లలో వంటగది ప్రధానమైన వస్తువుల కొరత, ధరల పెరుగుదల భయాన్ని పెంచుతుంది. నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం (NDOTA) సెప్టెంబర్ 2న.. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యను నిరసిస్తున్నట్లు ఆఫీస్ బేరర్ తెలిపారు. ఇది డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందన్నారు.

నిరవధిక సమ్మెపై ప్రభుత్వం చర్యలు

దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ సమ్మె చేస్తున్న వ్యాపారుల లైసెన్సులను సస్పెండ్ చేయాలని లేదా రద్దు చేయాలని సెప్టెంబర్ 21న యాక్షన్ టేకెన్ రిపోర్టును అందజేయాలని జిల్లా సబ్ రిజిస్ట్రార్, సహకార సంఘాలు అన్ని ఏపీఎంసీలకు ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే ఎగుమతి సుంకం పెంపు నిర్ణయానికి నిరసనగా జిల్లాలోని అన్ని ఏపీఎంసీలలో ఉల్లి వేలాన్ని నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించామని బేరర్ తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉల్లి ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుందని, రవాణాలో ఉన్న ఉల్లిపాయలు రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు.