మహారాష్ట్రలో వైరస్ విజృంభన.. ఒక్క రోజులో 36 మంది మృతి

మహారాష్ట్రలో వైరస్ విజృంభన.. ఒక్క రోజులో 36 మంది మృతి

ముంబై: రోజురోజుకు మహారాష్ట్రలో వైరస్ విజృంభిస్తోంది. శనివారం 790 కొత్త కేసులు నమోదు కాగా 36 మంది చనిపోయారు. ఒక్కరోజులో ఇంతమంది చనిపోయవడం రికార్డు అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 12,296 కు చేరుకోగా, మరణాల సంఖ్య 521 గా ఉంది. శనివారం ఒక్కరోజులో 121 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2 వేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. శనివారం మరణించిన వారిలో ముంబై కి చెందినవారు 27, ముగ్గురు పుణె, ఇద్దరు అమరావతికి చెందినవారున్నారని ప్రకటించారు.

ఢిల్లీలో ఒక్కరోజులో భారీగా పెరిగిన కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజులోనే 384 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు ఫైల్ కావడం ఇదే మొదటిసారి అన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,122 కు చేరుకుందని చెప్పారు. శనివారం కరోనాతో ముగ్గురు చనిపోయారని, 89 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. కోలుకున్న కరోనా పేషెంట్ల సంఖ్య 1256 కు పెరగగా.. ఇప్పటివరకు 64 మంది చనిపోయారు. ఢిల్లీలో మే 17 వరకు 11 జిల్లాలు రెడ్ జోన్​లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.