గాంధీ విగ్రహం ధ్వంసం.. రెండు వారాల్లో రెండో ఘటన

గాంధీ విగ్రహం ధ్వంసం.. రెండు వారాల్లో రెండో ఘటన

అమెరికాలో గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే విగ్రహాన్ని రెండుసార్లు ధ్వంసం  చేశారు. న్యూయార్క్ నగరంలోని తులసీ మందిర్ వద్ద గాంధీ విగ్రహం ఉంది. ఈ నెల 16వ తేదీన దుండగులు ఈ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ విధ్వేష పదాలు రాశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల ఉందని, వారిని పట్టుకోవడానికి గాలింపులు చేస్తున్నట్లు  తెలిపారు.

ఈ ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఖండించారు. నేరస్దులను త్వరితగతిన పట్టుకోవాలని, చట్ట ప్రకారం వారిని శిక్షించాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రిచ్ మండ్ హిల్స్ లోని శ్రీ తులసి మందిర్ వద్దనున్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం రెండు వారాల్లో ఇది రెండోసారి. ఈ నెల 3వ తేదీన విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా.. ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో, జూలై 14న కెనాడాలో ఉన్న గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తమైంది.