
- డీఎంఈ ఆఫీసు ముందు ఎంఎన్ఆర్, టీఆర్‌ఆర్, మహావీర్ కాలేజీల మెడికోల ధర్నా
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు తమకు వేరే కాలేజీల్లో సీట్లు ఇవ్వాలని ఎంఎన్ఆర్, టీఆర్‌ఆర్, మహావీర్ కాలేజీలకు చెందిన మెడికోలు ఆందోళనకు దిగారు. కోఠిలోని డీఎంఈ ఆఫీసు ఎదుట బుధవారం ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తప్పుదోవ పట్టిస్తోందని, మంత్రి హరీశ్ రావు స్పందించి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మెడికోలను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది స్టూడెంట్స్‌ను అనుమతించడంతో డీఎంఈ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ఈ సందర్భంగా మెడికోలు మాట్లాడుతూ.. రీలొకేషన్‌కు ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ఇచ్చినా వాటిని అమలు చేయకుండా రాష్ట్ర సర్కార్ తమను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ఒక్కసారి ఎన్‌ఎంసీ పర్మిషన్ రద్దు చేశాక.. పర్మిషన్ పునరుద్ధరించిన సందర్భాలు లేవన్నారు. ఇవన్నీ తెలిసినా వర్సిటీ అధికారులు తమ భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు వేరే కాలేజీల్లో సీట్లు ఇప్పించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
ఎవరు రీలొకేట్ చేయాలె?
స్టూడెంట్లను రీలొకేట్ చేయాలంటే ప్రైవేటు కాలేజీలు ఒప్పుకోవాలని, ఆయా కాలేజీల్లో అదనపు సీట్లకు ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇవ్వాలని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. సూర్యాపేట, నల్గొండ తప్పితే, మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే అదనంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, దీంతో ప్రభుత్వ కాలేజీల్లో స్టూడెంట్ల రీలొకేషన్ సాధ్యం కాదని అంటున్నారు. ఏయే ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెంచేందుకు వెసులుబాటు ఉందో ఎన్‌ఎంసీ చెప్తే స్టూడెంట్లను సర్దుబాటు చేస్తామంటున్నారు. అయితే, ఏయే కాలేజీల్లో వసతులు ఉన్నాయో చూసి, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పెడితే ఎన్‌ఎంసీ తప్పకుండా పర్మిషన్ ఇస్తుందని స్టూడెంట్లు చెప్తున్నారు. ప్రపోజల్స్ పంపకుండా సీట్లు పెంచాలంటే ఎన్‌ఎంసీ ఎలా పెంచుతుందని ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీల పర్మిషన్, సీట్లు ఇవ్వడం వంటి అధికారాలన్నీ ఎన్ఎంసీకే ఉన్నందున వాళ్లే ఆ పని చేయాలని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ గందరగోళంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
మహావీర్ మెడికల్ కాలేజ్ పిటిషన్ డిస్మిస్
ఎంబీబీఎస్, మెడికల్ పీజీ అడ్మిషన్లను రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వికారాబాద్‌లోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు డిస్మిస్ చేసింది. కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఎంసీ కమిటీ ఎదుట కాలేజీ అప్పీల్ చేసిందని, ఈ వ్యవహారాన్ని ఎన్‌ఎంసీ కమిటీ వద్దనే తేల్చుకోవాలని చెప్పింది. ఎన్‌ఎంసీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే, అప్పుడు హైకోర్టుకు రావొచ్చని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి బెంచ్ స్పష్టం చేసింది.