ప్రమాదకరంగా మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ చెరువులు

ప్రమాదకరంగా మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ చెరువులు
  • భారీ వర్షాలతో కోతకు గురైన కట్టలు
  • భయాందోళనలో ప్రజలు
  •  రిపేర్లు చేసేందుకు చర్యలు చేపట్టని ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కానీ కొన్ని చెరువుల కట్టలు బలహీనంగా ఉండడం, మరికొన్ని చోట్ల ఇప్పటికే కోతకు గురికావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టలకు రిపేర్లు చేసేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసినా నిధులు మాత్రం విడుదల కావడం లేదు.

ఇప్పటికే తెగిన 3 చెరువులు

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మొత్తం 1,594 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో 403 చెరువులను కాల్వల ద్వారా నీటిని తరలించి నింపుతుండగా, మిగిలిన 1,191 చెరువులు మాత్రం పూర్తిగా వర్షం నీటితోనే నిండుతున్నాయి. జిల్లాలో చెరువుల కింద మొత్తం 95,460 ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. ఇటీవల భారీ వర్షాలు పడడం, వరదలు రావడంతో జిల్లాలో 3 చెరువులు తెగిపోగా, మరో 7 చెరువులు ప్రమాదకర దశకు చేరుకున్నాయి. 

ప్రమాదం అంచున చెరువు కట్టలు

చెరువు కట్టల వద్ద మట్టి, రివిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జారిపోయి దెబ్బతినడం, కట్టల పక్కన ఉన్న చెట్లు కూలిపోవడంతో కట్టలకు బుంగలు పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెంలో కుంట, మరిపెడ మండలం నీలికుర్తిలోని గువ్వలకుంట కట్టలు తెగిపోయాయి. అలాగే గంగారం మండలంలో గజ్జెల చెరువుకు బుంగపడింది. తొర్రూరు మండలం అమ్మాపురం పెద్దచెరువు కట్ట వద్ద భారీ వృక్షం నేలకూలడంతో కట్ట కుంగిపోయి, బుంగ పడే ప్రమాదం ఏర్పడింది. మాటేడు గ్రామ పెద్ద చెరువు కట్ట కోతకు గురికాగా, ఇనుగుర్తి మండలంలో బంగారు కత్తువ చెరువు కట్టకు భారీ బుంగ పడి నీళ్లు బయటకు పోతున్నాయి. 

ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసినా నిధులు వస్తలే..

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో చెరువు కట్టలకు రిపేర్లు చేసేందుకు ఆఫీసర్లు రూ. 2 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు రాకపోవడంతో చెరువు కట్టల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఆఫీసర్లు స్పందించి చెరువు కట్టలకు రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

రిపేర్లు చేయాలి 

తొర్రూరు మండలం అమ్మాపురం చెరువు కట్ట కింద 300 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. చెరువు కట్ట సమీపంలో భారీ చెట్టు నేలకూలడంతో కట్ట దెబ్బతింది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కట్ట రిపేర్లకు చర్యలు తీసుకోవాలి.
- కందాటి అచ్చిరెడ్డి, అమ్మాపురం