
సూపర్ స్టార్ మహేష్ బాబు, లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెబుతారు’ అని త్రివిక్రమ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. బీడీ కాలుస్తూ స్టైల్‌గా జీపులో నుంచి దిగిన మహేష్ బాబు ‘చూడంగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఈల వేయాలనిపించిందా’ అంటూ రమణ పాత్రలో తాను కనిపించనున్నట్టు రివీల్ చేశాడు.
మహేష్ డైలాగ్స్, ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ అన్నీ మాసీగా, స్టైలిష్‌గా ఉంటూ ఇంప్రెస్ చేస్తున్నాయి. శ్రీలీలతో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ‘గుంటూరు కారం’.. ఎర్రగా, ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుక్కి తగిలిందనుకో కళ్లల్లో నుంచి వచ్చేది నీళ్లే’ అంటూ ట్రైలర్‌ను ముగించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మహేష్ తల్లి పాత్రను రమ్యకృష్ణ పోషించగా, జగపతిబాబు, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, జయరామ్, రాహుల్ రవీంద్ర, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, మనోజ్ పరమహంస విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి.