
- సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నం: మహేశ్కుమార్ గౌడ్
- ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నామని -పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తమది న్యాయబద్ధమైన కోరిక అని.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. మంగళవారం సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జీవో 9పై ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించాలని సింఘ్వీని మహేశ్ గౌడ్ కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు.
‘‘పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరం. ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో 9తో ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తి వివరాలతో వాదనలు వినిపించినా హైకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంపై అడ్వకేట్సింఘ్వీతో దాదాపు గంట పాటు అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించాం. గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది”అని ఆయన అన్నారు.
అప్పుడు మద్దతిచ్చి..ఇప్పుడు వ్యతిరేకిస్తున్నయ్..
లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెచ్చిన జీవో 9 చారిత్రాత్మకమని మహేశ్గౌడ్అన్నారు. ప్రజల జీవితాలు బాగుపరచాలన్న చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని.. కానీ, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించే విషయంలో ఈ రెండు పార్టీలు అడుగడుగునా వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు.