
- స్వాతంత్ర్యం కోసం బ్రిటీషోళ్లను గడగడలాడించింది
- దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చింది
- గాంధీ భవన్‌లో ఘనంగా పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో జాతీయభావాన్ని తీసుకొచ్చి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమన్నారు. ఎంతో మంది స్వాతంత్ర్య సంగ్రామంలో కుటుంబాలు, ఆస్తులను త్యాగం చేసి ఏండ్ల తరబడి జైళ్లో మగ్గారన్నారు.
గురువారం గాంధీ భవన్‌లో పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు సీనియర్ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రజలు తీవ్ర పేదరికంలో ఉండేవారని, ఆ టైంలో వారి కనీస అవసరాలు తీర్చడంతో పాటు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవలను ప్రజలు మరువలేరన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టే.. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చిందని గుర్తుచేశారు.
వాళ్ల నిస్వార్థ సేవతోనే హక్కులు..
వేలాది మంది త్యాగం, జైలు జీవితం గడిపిన వారి నిస్వార్థ సేవతోనే ప్రజలు అన్ని హక్కులను అనుభవిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అహింస, ఇతరులకు సేవ చేయడం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం లాంటి మూల సూత్రాలతోనే పార్టీ పని చేస్తుందని చెప్పారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదన్నారు.
సోనియా గాంధీ, పీవీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక గాంధీ లాంటి వాళ్లు దేశం కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు. ప్రపంచంలో ఇన్నేండ్లూ మనుగడ సాధించిన పార్టీ మరొకటి లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గొప్ప మానవతావాదిగా నిలిచిపోయారని, ఆయన త్వరలో చేపట్టే న్యాయ్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సేవాదళ్ ర్యాలీ..
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ భారీ ర్యాలీ తీసింది. గాంధీ భవన్ నుంచి సెక్రటేరియెట్ మీదుగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు సేవాదళ్ ర్యాలీని నిర్వహించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు సేవాదళ్ ఏర్పడి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టింది. మహేశ్‌కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మండవ వెంకటేశ్వర్ రావు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.