కేటీఆర్, కవిత మధ్య ఆస్తుల పంచాది..బీఆర్‌‌ఎస్‌లో నాలుగు ముక్కలాట:మహేశ్ గౌడ్

కేటీఆర్, కవిత మధ్య ఆస్తుల పంచాది..బీఆర్‌‌ఎస్‌లో నాలుగు ముక్కలాట:మహేశ్ గౌడ్
  • అది తీర్చలేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమైండు: మహేశ్ గౌడ్ 
  • అదును కోసం హరీశ్‌ రావు కాపుకాసి కూర్చున్నడు 
  • బీఆర్‌‌ఎస్‌లో నాలుగు ముక్కలాట.. ఇక ఆ పార్టీ పనైపోయింది  
  • బీసీ రిజర్వేషన్లను కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ బీసీ నేతలు ఏం చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఫైర్ 

నిజామాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తున్నదని, ఇక ఆ పార్టీ పనైపోయినట్టేనని పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్​గౌడ్ అన్నారు. ‘‘ఆస్తి పంపకాల్లో అన్నాచెల్లె (కేటీఆర్, కవిత) మధ్య ఫైటింగ్​ నడుస్తున్నది. పిల్లల పంచాది తీర్చలేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అదను కోసం హరీశ్​రావు కాపుకాసి కూర్చున్నారు” అని పేర్కొన్నారు. ఆదివారం రెండో రోజు  నిజామాబాద్​జిల్లాలో జనహిత పాద యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్​జరిగింది. 

ఈ సమావేశంలో మహేశ్ గౌడ్‌ మాట్లాడుతూ.. కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావట్లేదని, ఆమె గులాబీ రంగు తీసేసి బ్లూ కలర్​ వేసుకుంటున్నదని విమర్శించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి ఎంతో స్టడీ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల​బిల్లు తెచ్చారు. కానీ అది తనవల్లే వచ్చిందని కవిత రంగులు పూసుకుని సంబురాలు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం జరుగుతున్న టైమ్‌లో జైల్లో ఉన్న సంగతి ఆమె మరిచిపోయినట్టుంది” అని ఎద్దేవా చేశారు. 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తన తండ్రి కేసీఆర్​22 శాతానికి తగ్గించినప్పుడు కవిత నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 

పాదయాత్రపై దుష్ర్పచారం.. 

జనహిత పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్ స్టేట్‌ ఇన్‌చార్జ్​ మీనాక్షి నటరాజన్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నాం. ఈ యాత్రను ఖర్గే, రాహుల్ ఆదేశాలతో.. సీఎం రేవంత్​రెడ్డి సహకారంతో చేపట్టాం. సీఎం రేవంత్, నా మధ్య ఉన్న బంధం..  అన్నదమ్ముల బంధం కంటే ఎక్కువ” అని చెప్పారు. ‘‘కార్యకర్తల కష్టం వల్లే కాంగ్రెస్​అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుని వారి రుణం తీర్చుకుంటాం. గెలిచే అవకాశం ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తాం. పాత, కొత్త కలయికతో పార్టీని ముందుకు తీసుకెళ్లి అందరి గౌరవాన్ని కాపాడుతాం. సోషల్ మీడియాలో సర్కార్‌‌పై జరుగుతున్న దుష్ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఏండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.  

ప్రజలతో మమేకమయ్యేందుకే పాదయాత్ర: సీతక్క 

ప్రజలతో మమేకమయ్యేందుకే పాదయాత్ర చేపట్టినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ‘‘అధికారం ఉన్నా.. లేకున్నా.. నిత్యం ప్రజలతో, వారి మధ్యన ఉండడం కాంగ్రెస్ పాలసీ. గ్రౌండ్​ లెవల్‌లో పార్టీ గట్టిగా ఉంటేనే మరింత ఎదుగుతాం. లోపాలుంటే సెట్​చేసుకోవాలి” అని సూచించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. భక్తులు వెలిగించే అగరొత్తులపై కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నదని మండిపడ్డారు.  

గల్ఫ్ బాధితులతో కలిసి భోజనం.. 

జనహిత పాదయాత్రలో భాగంగా అంకాపూర్‌‌లో పార్టీ జెండాను మీనాక్షి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో రైతులతో మాట్లాడారు. గల్ఫ్​బాధిత కుటుంబాలతో కలిసి మహేశ్​గౌడ్​, మీనాక్షి నటరాజన్,​ ఇతర నాయకులంతా భోజనం చేశారు. అలాగే ఆలూర్ జెడ్పీ హైస్కూల్‌లో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క శ్రమదానం చేశారు.  స్కూల్ ఆవరణలో చెత్తాచెదారం ఊడ్చేశారు. మీనాక్షి చీపురు పట్టి టాయిలెట్స్ క్లీన్ చేశారు

దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు.. 

దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘బీజేపీని శ్రీరాముడే స్థాపించినట్టు, శ్రీరాముడికి బీజేపీలో మెంబర్‌‌షిప్​ ఉన్నట్టు ఆ పార్టీ నాయకుల తీరు ఉంది. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే వినాశనానికి దారితీస్తుంది” అని హెచ్చరించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఆ పార్టీ కూటమి సర్కార్ ఉన్న ఏపీలోనూ ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం వద్దనడం ఎక్కడి నీతి? బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బీజేపీ నేతలు.. ఆ బిల్లులు ఢిల్లీకి చేరగానే మాట మార్చారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కామెంట్లు చేస్తుంటే.. ఆ పార్టీ బీసీ నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి  అర్వింద్​ దద్దమ్మల్లా చూస్తూ ఊరుకుంటున్నారు. మీరు బీసీ బిడ్డలు కాదా? చేవ చచ్చినవారయ్యారా?” అని ఫైర్ అయ్యారు. ప్రతి సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన సర్కార్​ ఫలాలు అందాలన్నదే తమ ప్రభుత్వ సిద్ధాంతమని, బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీకి వెళ్తామని చెప్పారు.  

దేశానికి తెలంగాణ ఆదర్శం: మీనాక్షి

దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ అన్నారు. రాజకీయాల మాటున సంపాదన ఆశించే వారెవరూ కాంగ్రెస్‌లో ఉండరని, అందరూ ప్రజాసేవ కోసమే కొనసాగుతారని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బిహార్‌‌లో పేదల ఓట్లను కేంద్రం తొలగిస్తున్నదని మండిపడ్డారు.