దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి.. కోట్లు దండుకున్నరు : మహేశ్ గౌడ్

దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి.. కోట్లు దండుకున్నరు : మహేశ్ గౌడ్
  • సన్నబియ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ ​ఫ్యామిలీకి లేదు: మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు:కేసీఆర్ కుటుంబం దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి కోట్ల రూపాయలు దోచుకున్నదని.. అలాంటి ఫ్యామిలీకి, బీఆర్ఎస్​నేతలకు సన్నబియ్యం స్కీంపై మాట్లాడే అర్హత  లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి దందా చేశారని ఆయన ఆరోపించారు. హరీశ్​రావు స్టార్ హోటల్ లో కాకుండా పేదోడి ఇంట్లో భోజనం చేస్తే సన్నబియ్యం నాణ్యత తెలుస్తుందన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. అధికారంలోకి వస్తామంటూ కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారని, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం కేసీఆర్ కొడుకు, బిడ్డగా కేటీఆర్, కవిత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వారసులుగా నేతల పిల్లలు ఉండడంలో తప్పులేదని.. కానీ, రాజకీయాల్లో ఎలాంటి పాత్ర నిర్వర్తించకుండా పదవులు పొందడాన్ని తప్పుపడుతున్నామన్నారు.

వాళ్లు రావడం వల్లే కాంగ్రెస్​కు​ విజయావకాశాలు

కేసీఆర్ ఆర్థిక దోపిడీని భరించలేక, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్​లోకి వచ్చారని మహేశ్​గౌడ్​తెలిపారు. ‘కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వొద్దనే ఏకైక లక్ష్యంతోనే  వీరంతా కాంగ్రెస్ లో చేరారు. వీరి వల్ల విజయావకాశాలు మెరుగుపడి, పార్టీ అధికారంలోకి రాగలిగింది’ అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేత జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

 మంత్రి పదవి ఫలానా వ్యక్తికి ఇవ్వొద్దని జానారెడ్డి ఎక్కడా చెప్పలేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, అందుకే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడారని చెప్పారు. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు కావాల్సిందేనని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మహేశ్​గౌడ్ స్పష్టం చేశారు.