
ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. శ్రీమంతుడు సినిమా తరహాలో మహేష్ బాబు ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొని.. ప్రతి సారి ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. బుర్రిపాలెం మహేష్ సొంత గ్రామమని అందరికి తెలిసిన విషయమే. ఆ గ్రామాభివృద్ధికి మహేష్ చాలాసార్లు సహాయపడ్డాడు. చిన్నారులకు సంబంధించిన హార్ట్ ఆపరేషన్స్ చాలానే చేశాడు. భార్య నమ్రత ఆధ్వర్యంలో 1000కి పైగా పసి ప్రాణాలకు ఊపిరి పోశారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ తన దత్తత గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం. బాధ్యతాయుతంగా ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించెలా ఏర్పాట్లు చేస్తున్నాడట. రెండ్రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని మహేష్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఒక్క హీరో కూడా ఇలానే చేస్తే కనీస కొన్ని గ్రామాలైనా ఈ సమస్యల నుంచి కోలుకునే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.