వంట నేర్చుకోవడం అమ్మాయిలకేనా..? ..ఇంటర్ పుస్తకాల్లో 'లింగ వివక్ష'పై సీఎం రేవంత్రెడ్డి కి విద్యార్థిని లేఖ

వంట నేర్చుకోవడం అమ్మాయిలకేనా..? ..ఇంటర్ పుస్తకాల్లో 'లింగ వివక్ష'పై సీఎం రేవంత్రెడ్డి కి విద్యార్థిని లేఖ
  •     అబ్బాయిలకు కెరీర్ ప్లానింగా..?
  •     ఎగ్జామ్ లోనూ ప్రశ్న రావడంపై క్రీడాకారిణి తీవ్ర విస్మయం

హైదరాబాద్, వెలుగు: సమాజంలో సమానత్వాన్ని పెంపొందించాల్సిన పాఠ్యపుస్తకాలు నేటికీ లింగ వివక్షా ధోరణులను ప్రదర్శించడంపై ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని గళమెత్తారు. ఆడపిల్లలను కేవలం వంట గదికే పరిమితం చేస్తూ మగపిల్లలకే భవిష్యత్ ఉంటుందనేలా పాఠ్యాపుస్తకాల్లో ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇదే అంశం ఎగ్జామ్స్ లోనూ రావడంపై తీవ్ర విస్మయం చెందారు. ఈ లింగ వివక్షతను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహిమ కీర్తన సిరంగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.  

పరీక్షలో వచ్చిన ప్రశ్నలే దీనికి కారణం..?

ఇటీవల జరిగిన ఇంటర్ బోర్డు ఇంగ్లిష్ పరీక్షల్లో డైలాగ్ రైటింగ్ విభాగంలో ఇచ్చిన ప్రశ్నలే ఈ వివాదానికి కారణమైంది. ఇంటర్​పరీక్షలో ‘వంట నేర్పించాలనుకునే తల్లికి, కూతురికి మధ్య జరిగే సంభాషణ’ గురించి రాయమని ఒక ప్రశ్న ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఇదే క్వశ్చన్​లో రెండో ఆప్షన్‌‌‌‌గా ' కొడుకు భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకునే తండ్రికి, కొడుకుకి మధ్య జరిగే సంభాషణ’ గురించి రాయమని ఇచ్చారని తెలిపారు. రెండు అంశాలు(ప్రశ్నలు) మా పాఠ్యపుస్తకాల్లోనూ ఉన్నాయన్నారు. 

వంట అనేది ఆడ, మగ అందరికీ అవసరమైన ప్రాథమిక నైపుణ్యమని, కానీ కేవలం అమ్మాయిలనే వంటగదికి పరిమితం చేస్తూ, అబ్బాయిలకు మాత్రమే కెరీర్ ఉంటుందనేలా ప్రశ్నలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 2026 నాటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి భావజాలం నేర్పడం విద్యావ్యవస్థ వైఫల్యమేనని మహిమ తన లేఖలో పేర్కొన్నారు. అయితే.. తాను ఒక జాతీయ స్థాయి రైఫిల్ షూటర్‌‌‌‌నని, 2023లో తెలంగాణ రాష్ట్ర ఎస్‌‌‌‌జీఎఫ్‌‌‌‌ఐ ఛాంపియన్‌‌‌‌గా నిలిచానని గుర్తుచేశారు. దేశంలోనే నల్సార్ లో తనకు సీటు వచ్చిందని తెలిపారు. 

‘నేను ఒక షూటర్‌‌‌‌గా, కాబోయే న్యాయవాదిగా నా భవిష్యత్​ను తీర్చిదిద్దుకుంటున్నాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వంట చేస్తారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే విద్యావ్యవస్థే ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థినులను వెనక్కి నెట్టడం విచారకరం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు సమానత్వాన్ని, మంచి విలువలను నేర్పాలని మహిమ చెప్పారు. ఇలాంటి లింగ వివక్షతో కూడిన అంశాలను సిలబస్ నుంచి తొలగించి, మార్పు తీసుకురావాలని సీఎంను ఆమె కోరారు.