- మరోసారి మహీంద్రా ఎస్‌యూవీ ధరల పెంపు!
- త్వరలో నిర్ణయిస్తామన్న కంపెనీ సీఈఓ
న్యూఢిల్లీ: ముడిసరుకుల ధరలు పెరగడంతో తమ ఎస్‌యూవీ ధరలను మరోసారి పెంచాలని చూస్తున్నామని, రాబోయే రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్రెసిడెంట్, సీఈఓ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్, జులైలలో మూడుసార్లు ధరలు పెంచామని, పెరుగుతున్న కమోడిటీ ఖర్చుల దృష్ట్యా నాలుగో పెంపుపై త్వరలో నిర్ణయం ఉంటుందన్నారు. కిందటేడాది జీఎస్టీ రేట్లు తగ్గించడంతో ఇప్పటికీ కార్ల ధరలు గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని, అందుకే వరుస పెంపులు ఉన్నప్పటికీ బుకింగ్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని, పండుగ సీజన్ అమ్మకాలు బలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
‘‘ప్రభుత్వ నిబంధనలు ఈవీలకు అనుకూలంగా ఉండడంతో తాము హైబ్రిడ్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఆరు నెలల్లో నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 68 వేల యూనిట్ల నుంచి 84 వేల యూనిట్లకుపెంచుతాం. ఇందులో పెట్రోల్, డీజిల్ బండ్లు 70 వేలు, ఈవీలు 12 వేలు ఉంటాయి. రాబోయే ఆరు నెలల్లో ఒక పెట్రోల్ లేదా డీజిల్, ఒక ఈవీ మోడల్‌తో పాటు 2-3 ఫేస్‌లిఫ్ట్ కార్లను విడుదల చేస్తాం”అని నళినికాంత్ వివరించారు.
