టార్గెట్.. కార్పొరేషన్..కరీంనగర్లో చేరికలపై ప్రధాన పార్టీల దృష్టి

టార్గెట్.. కార్పొరేషన్..కరీంనగర్లో చేరికలపై ప్రధాన పార్టీల దృష్టి
  • బీజేపీలో చేరిన బీఆర్ఎస్     మాజీ కార్పొరేటర్ వేణు
  • మాజీ మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్​లోకి బీజేపీ నాయకులు
  • కరీంనగర్ సిటీ అభివృద్ధికి మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ ఇన్​చార్జి వెలిచాల
  • సొంతంగానే బరిలోకి ఎంఐఎం 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ ఎన్నికలు కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సవాల్ గా మారాయి. ఇప్పటికే వీరు ముఖ్య నాయకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గెలుపు గుర్రాల కోసం సర్వేలు చేయిస్తున్నారు. 

మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో 51వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు బుధవారం 50 మంది నాయకులతో బీజేపీలో చేరగా.. అదే డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

 రేకుర్తికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నందెల్లి ప్రకాశ్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ లో చేరగా.. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. గత పాలకవర్గంలో ఏడుగురు కార్పొరేటర్లు ఉన్న ఎంఐఎం ఈసారి కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నగరంలోని 40 డివిజన్ల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున కార్పొరేటర్​గా పోటీ చేయాలనుకునే 140 మంది అప్లికేషన్లను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారు. లీడర్ల హడావుడి, సమావేశాలు, ప్రెస్ మీట్​లతో నోటిఫికేషన్ కు ముందే కరీంనగర్ లో ఎన్నికల సందడి నెలకొంది. 

ఆపరేషన్ ఆకర్ష్​షురూ చేసిన బీజేపీ 

ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. తమ పార్టీలో చేరేందుకు మాజీ కార్పొరేటర్లు, లీడర్లు చాలా మంది సంప్రదిస్తున్నారని, అయితే అవినీతి, భూకబ్జా ఆరోపణలు ఉన్నోళ్లను చేర్చుకునేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. మరో 10 మంది బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలిసింది. పండుగ తర్వాత చేరికలు ఉండే అవకాశాలున్నాయి. 

కాంగ్రెస్ లో లీడర్ల ఐక్యతారాగం 

గత పాలకవర్గంలో కాంగ్రెస్ కు ఒక్క కార్పొరేటర్ కూడా లేరు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్​ఎన్నికలకు ముందు 2024 మే నెలలో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మరో ఇద్దరు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరు మళ్లీ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. 

ఈ క్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెలిచాల రాజేందర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఐక్యతను చాటడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఇచ్చింది. 

సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సుడా పనుల శంకుస్థాపనల్లో అంజన్ కుమార్ ను భాగస్వామ్యం చేస్తున్నారు. కరీంనగర్ సిటీ అభివృద్ధిపై రూపొందించిన మేనిఫెస్టోను రాజేందర్​రావు విడుదల చేశారు. నేతలందరూ కాంగ్రెస్ గెలిచే డివిజన్లు, ఆశావహుల్లో విజయం సాధించే అవకాశాలున్న అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డారు. 

బీఆర్ఎస్ మాజీలపై కబ్జాలు,  బెదిరింపుల ఆరోపణలు 

12 మంది బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా.. మాజీ మేయర్ సునీల్ రావుతోపాటు మరికొందరు మాజీ కార్పొరేటర్లు బీజేపీ లో చేరడం, ఇంకొందరు చేరేందుకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీనపడిందన్న ప్రచారం జరుగుతోంది. నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన బుజ్జగిస్తున్నా చాలామంది పార్టీని వీడేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. 

భూకబ్జా కేసుల్లో 2024లో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లతోపాటు, ఆరుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు జైలుకు వెళ్లారు. మాజీల భూకబ్జాలు, బెదిరింపులు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అభ్యర్థి ఎవరైనా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల భారమంతా ఎమ్మెల్యే కమలాకర్ మోయాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే కార్పొరేషన్ ఎన్నికల ఇన్ చార్జిగా మాజీ మంత్రి హరీశ్​రావును బీఆర్ఎస్​అధిష్ఠానం నియమించినట్లు తెలిసింది.