చేరికలపై ప్రధాన పార్టీల నజర్​

చేరికలపై ప్రధాన పార్టీల నజర్​
  •  గ్రామ, మండల స్థాయి లీడర్లపై ఫోకస్​
  • లోకల్ గా పట్టు కోసం ముమ్మర ప్రయత్నాలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ప్రధాన పార్టీలు చేరికలపై నజర్ ​పెట్టాయి. వేరే పార్టీలో కొనసాగుతున్న లీడర్లను నయానోబయానో చెప్పి ఒప్పించి తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామీణ స్థాయిల్లో పట్టున్న నేతల కోసం ప్రధాన పార్టీల లీడర్లు జల్లెడ పడుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​లోకి వలసలు పెరిగాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ​పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో వలసలు అధికంగా ఉన్నాయి. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి, భిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన పలువురు గ్రామస్థాయి లీడర్లు, యువత కాషాయ కండువాలు కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్​ కూడా అదే స్థాయిలో చేరికలపై ఫోకస్​పెట్టింది. 

ఈ  నెల 7న పార్టీ కేటీఆర్​ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బీజేపీ కౌన్సిలర్​తో పాటు, కాంగ్రెస్​కు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి సైతం వివిధ పార్టీల్లో ఉన్న లీడర్లపై ఫోకస్​ పెట్టారు. ఇటీవల బీబీపేట, కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన పలువురు వీరి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​లోకి కూడా జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి షబ్బీర్​ అలీ సమక్షంలో   నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. 

మిగతా నియోజకవర్గాల్లోనూ..

ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజవర్గాల్లోనూ వివిధ పార్టీల్లో  చేరికలు కొనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన వారు ఇటీవల ఎమ్మెల్యే జాజాల సురేందర్​ సమక్షంలో  బీఆర్ఎస్​లో చేరారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్​ఆశిస్తున్న మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డిల ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు చేరారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పలువరు అధికార పార్టీలో చేరారు. పలు కులసంఘాల ప్రతినిధులు సైతం ఎన్నికల అభ్యర్థులను కలిసి మద్దతు తెలుపుతున్నారు.

మండల స్థాయి నేతలపై ఫోకస్..​  

కామారెడ్డి నియోజకవర్గంలో మండల స్థాయి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వస్తే పార్టీలో గుర్తింపు ఇస్తామని హామీలిచ్చి చేరికలను ప్రోత్సహిస్తున్నారు.