రోహిత్ ఫిట్‌‌గా ఉన్నాడు.. ఇప్పుడదే ఇంపార్టెంట్

రోహిత్ ఫిట్‌‌గా ఉన్నాడు.. ఇప్పుడదే ఇంపార్టెంట్

న్యూఢిల్లీ: రాబోయే ఆస్ట్రేలియా టూర్‌‌లో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. గాయంతో బాధపడుతున్నందునే రోహిత్‌‌ను పక్కన బెట్టారని సమాచారం. అయితే తాను ఫిట్‌గా ఉన్నానంటూ రీసెంట్‌‌గా సన్ రైజర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో రోహిత్ స్పష్టం చేయడం వివాదానికి దారి తీసింది. కావాలనే రోహిత్‌‌ను పక్కనబెట్టారా? కోహ్లీ-రోహిత్‌కు మధ్య చెడిందా? రోహిత్ గాయం తీవ్రతపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వక పోవడంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. వైస్ కెప్టెనా లేదా కెప్టెనా అనేది విషయం కాదని, ఒక ప్లేయర్ అందుబాటులో ఉన్నప్పుడు అతడ్ని ఎంపిక చేయకపోవడమే పెద్ద విషయమని గవాస్కర్ చెప్పాడు.

‘రోహిత్ గాయంపై కొనసాగుతున్న వివాదాన్ని పక్కనబెడితే.. అతడు ఫిట్‌‌గా ఉండటం మంచి విషయం. రోహిత్ కాన్ఫిడెన్స్‌‌తో కనిపిస్తున్నాడు. అతడు బౌండరీ రోప్ దగ్గర ఫీల్డ్ చేశాడు. అలాగే థర్టీ యార్డ్ సర్కిల్‌‌లో కూడా బాగా ఫీల్డింగ్ చేశాడు. తాను ఫిట్‌‌గా ఉన్నానని నిరూపించేందుకు ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో రోహిత్ బరిలోకి దిగాడు. అయినా సరే.. బీసీసీఐ అతడి ఫిట్‌‌నెస్‌‌ను పరీక్షించాలనుకుంటే అందులో తప్పేం లేదు. మామూలుగా గాయం నుంచి తిరిగొచ్చిన ప్లేయర్‌‌ను ఫిట్‌‌నెస్ కోసం కొన్ని మ్యాచులు ఆడిస్తారు. తన ఫిట్‌‌నెస్‌‌పై మ్యాచుకు ముందు, ఆ తర్వాత రోహిత్‌‌ను ప్రశ్నిస్తే.. రెండుసార్లూ ఫిట్‌‌గా ఉన్నట్లు అతడు క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న వివాదం, దానికి సంబంధించిన అంశాలు అనవసరం. ఇవాళ్టి గురించే మనం మాట్లాడాలి. నేడు అతడు ఫిట్‌‌గా ఉన్నాడు అంతే’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.