బైపోల్​పై ప్రధాన పార్టీల ఫోకస్

బైపోల్​పై ప్రధాన పార్టీల ఫోకస్
  • టీఆర్ఎస్‌‌లో చల్లారని అసంతృప్తి.. 
  • కలకలం రేపుతున్న రెబెల్స్ మీటింగ్
  • బీజేపీలో పలు కమిటీలతో తరుణ్ చుగ్ భేటీ
  • మునుగోడు, నాంపల్లి మండలాల్లో రాజగోపాల్ పర్యటన
  • ఇయ్యాల్టి నుంచి కాంగ్రెస్​ పాదయాత్ర
  • 20న టీఆర్ఎస్, 21న బీజేపీ బహిరంగ సభలు

నల్గొండ, వెలుగు: రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా బైపోల్‌‌ పైనే ఫోకస్ పెట్టారు. ఈ నెల 20న టీఆర్ఎస్, 21న బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా శనివారం నుంచి నారాయణ్​పూర్, చౌటుప్పల్ మండలాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు, నారాయణపూర్​ మండలాల్లో సభ కోసం శుక్రవారం స్థలాలను పరిశీలించి.. మునుగోడులోనే సీఎం సభ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అసమ్మతివాదులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా చౌటుప్పల్ మండలంలోని ఆందోల్ మైసమ్మ టెంపుల్ వద్ద మీటింగ్ పెట్టుకున్నారు. కూసుకుంట్లకు టికెట్​ ఇవ్వొద్దని కోరుతూ తీర్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి శుక్రవారం మునుగోడు, నాంపల్లి మండలాల్లో పర్యటించారు. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో స్థానిక నేతలకు వివరించారు. 21న నిర్వహించే అమిత్​షా బహిరంగ సభ గురించి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జి తరుణ్ చుగ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తదితర లీడర్లు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌‌ని కలిశారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పలు కమిటీలతో తరుణ్ చుగ్ భేటీ ఆయ్యారు. ఉప ఎన్నికల్లో తమ వైఖరిని నిర్ణయించుకునేందుకు చండూరులో పార్టీ నేతలతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్‌‌‌‌లో అసమ్మతి సద్దుమణగడంలేదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని జిల్లా మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి, పార్టీ ఇన్​చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌రావుకు మాట ఇచ్చిన తిరుగుబాటు నేతలు తర్వాత ప్లేట్ ఫిరాయించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని తేల్చిచెప్పారు. ఇప్పటిదాకా కూసుకుంట్లకు మద్దతుగా ఉన్నవాళ్లు కూడా అసమ్మతి నేతలతో స్వరం కలిపారు. శుక్రవారం జరిగిన అసమ్మతి నేతల మీటింగ్‌‌‌‌కు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, నారాయణపూర్ జడ్పీటీసీ భర్త వీరమల్ల వెంకటేశ్ గౌడ్‌‌‌‌తోపాటు  300 మంది హాజరయ్యారు. ‘‘పార్టీని కాపాడుకోవాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.  రాష్ట్రం మొత్తం ఇప్పుడు మునుగోడు వైపే చూస్తున్నది. కాబట్టి ఈ సమావేశం సంగతి కేసీఆర్ దాకా వెళ్తుంది. మునుగోడు  ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరుతున్నాం. ప్రభాకర్ రెడ్డికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించడానికి కృషి చేస్తాం” అని తాడూరి వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. మరోవైపు మంత్రి బుజ్జగింపులతో కొందరు లీడర్లు సైలెంట్‌‌‌‌గా ఉంటున్నా.. కూసుకుంట్లకు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువనేనని చర్చ నడుస్తున్నది. 

రేవంత్ పాదయాత్రకు భారీగా జన సమీకరణ

నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించనున్న ఆజాదీకా గౌరవ్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. గుడి మల్కాపూర్  నుంచి ప్రారంభించే యాత్రలో కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. పార్టీని బలోపేతం చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ ఇప్పటికే తేల్చిచెప్పింది. రేవంత్​రెడ్డి త్వరలో అన్ని మండలాల్లో పర్యటించనున్నారు.

టీఆర్ఎస్‌‌‌‌తో దోస్తీకే కమ్యూనిస్టుల ఆసక్తి

మునుగోడులో సీపీఎం, సీపీఐ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. రెండు పార్టీల్లోనూ టీఆర్ఎస్‌‌‌‌ వైపే మొగ్గు కనిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలకు ఇక్కడ దాదాపు 20 వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. నారాయణపూర్, చౌటుప్పల్‌‌‌‌లో గతంలో సీపీఎం, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని లోకల్​బాడీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగించాలని సీపీఎం భావిస్తోంది. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌కు మద్దతు ఇచ్చిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె సందర్భంగా దూరమైంది. హుజూరాబాద్‌‌‌‌లో తటస్థంగా ఉంది. చండూరులో శుక్రవారం జరిగిన మీటింగ్‌‌‌‌లో స్థానిక నాయకత్వం టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపిందని సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్ తమను ఫోన్​లో సంప్రదించాయని, రాతపూర్వకంగా మద్దతు కోరితే ఈ నెల 20న నిర్ణయం తీసుకుంటామని పార్టీ నేతలు చెప్పారు.

కొత్తోళ్లను కలుపుకొని పోవాలి: బీజేపీ

మునుగోడులో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చే నాయకులను కలుపుకుని వెళ్లాలని కేడర్‌‌‌‌‌‌‌‌కు పార్టీ అగ్రనేతలు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని శక్తి కేంద్రాల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లు మునుగోడులో పనిచేయాలని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ తరుణ్​చుగ్, వివేక్ వెంకటస్వామి తదితరులు మునుగోడు బీజేపీ లీడర్లతో జరిగిన వివిధ సమావేశాల్లో కేడర్‌‌‌‌‌‌‌‌కు పార్టీ వ్యూహాన్ని వివరించారు.​ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లను వేరుగా చూడొద్దని, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచామని, అప్పటికన్నా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగినందున మునుగోడులోనూ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పోలింగ్ బూత్‌‌‌‌ల బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.