
- జగిత్యాలలో మక్కరైతులను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం
- ఎక్కడికక్కడ అరెస్టులు,గృహ నిర్బంధాలు
- అయినా ముందుకు కదిలిన రైతులు.. 5 గంటలపాటు ధర్నా
జగిత్యాల, వెలుగు: జగిత్యాలలో శుక్రవారం రైతులు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం సాయంత్రం నుంచే పోలీసులు 144 సెక్షన్ విధించి, రైతులకు నోటీసులు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా రైతులను, రైతు ఐక్య వేదిక నాయకులను, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్తదితర పార్టీల నాయకులను ఇండ్లకు వెళ్లి అరెస్టు చేశారు. 250 మందిని అదుపులోకి తీసుకొని.. ఒక మండలం నేతలను మరోమండలంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొందరిని హౌజ్ అరెస్టులో ఉంచారు. మండలాలనుంచి జగిత్యాలకు వచ్చే అన్ని రోడ్లలో చెక్‌పోస్టులు పెట్టారు. కానీ పోలీసుల నిర్బంధాన్ని తెంచుకొని రైతులు వేర్వేరు దారుల్లో జగిత్యాల చేరుకున్నారు. అనుకున్న టైమ్‌కు కలెక్టరేట్ ను ముట్టడించి ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రత్నించారు. ఒక దశలో పోలీసుల తీరు మీద రైతులు మండిపడ్డారు. మక్కలను ప్రభుత్వమే కొనాలని, సన్నవడ్లకు కనీస మద్దతు ధర రూ. 2,500 చెల్లించాలన్న డిమాండ్ చేశారు.
పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
కలెక్టరేట్ దగ్గర చాలాసేపు బైఠాయించిన రైతులు అనంతరం హైవే మీద ధర్నా చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను వ్యాన్లలో తరలించేందుకు ప్రయత్నించగా.. కొందరు వాహనం అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులను నెట్టేసి అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలించారు. దీంతో మిగిలిన రైతులంతా ధర్నా కొనసాగించారు. కలెక్టరేట్, హైవేల మీద 5 గంటల పాటు ధర్నా జరగింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ సమస్యలపై కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అంతవరకు ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ఎస్పీ సింధు శర్మ ,అడిషనల్ ఎస్పీ సురేష్ ,డీఎస్పీ వెంకట రమణ, సీఐ లు జయేష్ రెడ్డి, ప్రకాష్, రాజేశ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ రైతుల దగ్గరకు వచ్చారు. రైతులు ఇచ్చిన మెమొరాండం తీసుకుని రైతులను వదిలేస్తామని, కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆరేండ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి?
పంటకు మద్దతు ధర పొందడం రైతు హక్కు అని, దీన్ని ప్రభుత్వాలు కల్పించకపోవడం బాధాకరమని రైతు సంఘాల నేతలు అన్నారు. ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆరేండ్లలో రైతులకు రాష్ట్రంలో ఏం చేశారో ప్రభుత్వం వైట్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు మద్దతు ధరతోపాటు బోనస్ ప్రకటించాయని, రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ బోనస్ ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. రైతు బంధు పథకం తో సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి లాభం లేదని, బడా భూస్వాములే లాభపడుతున్నారన్నారు.