
కరీంనగర్, వెలుగు : నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌లో స్వాతంత్ర్య వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వృథాగా పోతున్న నీళ్ల విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరద నీళ్లే వినియోగించుకుంటామని వంకలు చెబుతూ ప్రాజెక్ట్ కట్టాలని చూస్తే ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ సూచనల మేరకే మేడిగడ్డలో నీళ్లు నింపడం లేదని, నివేదిక అధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వానికి మొదటి ప్రయార్టీ అని చెప్పారు.
మంత్రులు స్వయంగా కోరుతున్నా... కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదని, రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. వామనరావు దంపతుల హత్య కేసులో అసలు నిందితులు ఎవరో సీబీఐ విచారణతో తేలనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. వామనరావు దంపతుల హత్యలో చాలా మంది పెద్దల హస్తం ఉందన్నారు. నాటి ప్రభుత్వం చట్టాలను ఉపయోగించి బాధితులనే భయపెట్ట ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఉన్నారు.