ఎర్రకోటపై మోదీ నోట ఆర్ఎస్ఎస్ మాట.. మాతృభూమి కోసం వాళ్లు జీవితాన్ని అంకితం చేశారని వ్యాఖ్య

ఎర్రకోటపై మోదీ నోట ఆర్ఎస్ఎస్ మాట.. మాతృభూమి కోసం వాళ్లు జీవితాన్ని అంకితం చేశారని వ్యాఖ్య
  • సేవ, అంకితభావం, అద్భుతమైన క్రమశిక్షణే సంఘ్​ గుర్తింపు అని వ్యాఖ్య
  • పదవిని కాపాడుకోవడం కోసమే మోదీ అట్ల మాట్లాడారు: కాంగ్రెస్

ప్రధాని మోదీ తన ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో తొలిసారిగా బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పేరును శుక్రవారం ప్రస్తావించారు. భారత జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ వందేండ్లుగా కృషి చేస్తోందని కొనియాడారు. ‘‘ఆర్ఎస్ఎస్ వందేండ్ల క్రితం ఏర్పాటైంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవోగా అవతరించింది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు వందేండ్లుగా వ్యక్తిత్వ నిర్మాణం, జాతి నిర్మాణం, మాతృభూమి సంక్షేమం కోసం జీవితాలను అంకితం చేస్తున్నారు. నేడు ఎర్రకోటపై నుంచి నేను వారందరినీ గుర్తు చేసుకుంటున్నా. సేవ, అంకితభావం, అద్భుతమైన క్రమశిక్షణే ఆర్ఎస్ఎస్ కు గుర్తింపు. వందేండ్లుగా దేశ సేవకు అంకితమైన ఆ సంస్థ చాలా గర్వకారణం. అది ఎల్లప్పుడూ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటుంది” అని మోదీ అన్నారు.

అయితే, గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ (వాలంటీర్)గా పని చేసిన మోదీ.. ప్రధానిగా ఇప్పటివరకూ 12 సార్లు ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పీచ్ ఇచ్చారు. కానీ తన గత ప్రసంగాల్లో ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ పేరును ఆయన ప్రస్తావించలేదు. కాగా, ఆర్ఎస్ఎస్ ను 1925 సెప్టెంబర్ 27న కేబీ హెడ్గేవార్ స్థాపించారు. వచ్చే నెలతో ఈ సంస్థకు వందేండ్లు పూర్తి కానున్నాయి.

యువతకు ఆర్థిక భరోసా
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్‌ యోజన పేరుతో కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో మొదటి సారి ఉద్యోగం పొందిన యువతకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తాం. ఈ పథకం కింద 3.50 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకూ తగిన ప్రోత్సాహకాలు ఇస్తాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​వో)లో ఫస్ట్ టైమ్ రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు 2 విడతలుగా రూ.15 వేలు ఇస్తాం.  లక్ష రూపాయల జీతం ఉన్న ఉద్యోగులు కూడా అర్హులే. 6 నెలల సర్వీస్ తర్వాత ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్, మరో 6 నెలల సర్వీస్‌లో సెకండ్ ఇన్​స్టాల్​మెంట్ అందజేస్తాం.

ప్రధాని నరేంద్ర మోదీ