భైంసా అల్లర్ల వెనుక మజ్లిస్

భైంసా అల్లర్ల వెనుక మజ్లిస్

ఆ పార్టీకి టీఆర్​ఎస్​ అండ: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
కల్వకుంట్ల, ఒవైసీ ఫ్యామిలీల చేతుల్లో రాష్ట్రం బందీ
బీజేపీని విమర్శించే హక్కు కేసీఆర్​కు లేదు
చెల్లెలి ఓటమిని తట్టుకోలేకే  కేటీఆర్ ఆరోపణలు
ఎన్నికల హామీలు మరిచిన టీఆర్​ఎస్​
కేంద్రం ఇస్తున్న నిధులు వాళ్లకు కనిపించడం లేదా?అని ప్రశ్న
భైంసా ఘటన బాధితులకు లక్ష్మణ్​, పార్టీ ఎంపీలతో కలిసి పరామర్శ

నిర్మల్‍, వెలుగుకల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ అయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‍రెడ్డి అన్నారు. ఆ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఆ కుటుంబాల కోసం కాదని తెలిపారు. మజ్లిస్​ పచ్చి మతోన్మాద పార్టీ అని, భైంసా ఘటనకు అదే కారణమని, ఆ పార్టీకి టీఆర్​ఎస్  అండదండలు ఉన్నాయని ఆరోపించారు. భైంసాలో జరిగిన అల్లర్ల బాధిత కుటుంబాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‍, ఎంపీలు ధర్మపురి అర్వింద్‍, బండి సంజయ్‍, సోయం బాపూరావు, రాజ్య సభ సభ్యుడు రామ్మోహన్‍, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి ఆయన పరామర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ బాధితులతో మాట్లాడారు. బీజేపీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. అనంతరం మీడియా సమావేశంలో కిషన్‍రెడ్డి మాట్లాడారు. భైంసాలో అల్లర్లు జరిగినప్పుడే కేంద్ర ప్రభుత్వం తరఫున తాను రాష్ట్ర పోలీసులతో మాట్లాడానని తెలిపారు.

శాంతియుత వాతావరణం ఏర్పడేంత వరకు ఘటనపై ఆరా తీశామన్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే  ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. అప్పుడు తాను ఢిల్లీలో ఉన్నందున రాలేకపోయానని చెప్పారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల నుంచి రక్షించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని అందరం అనుకున్నామని, కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి రెండు కుటుంబాల చేతుల్లో బందీ అయిందని పేర్కొన్నారు. ఆ రెండు ఫ్యామిలీల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త ఒక్కో నరేంద్రమోడీ అని, పల్లెల్లో పర్యటించి బీజేపీని బలోపేతం చేయాలన్నారు.

సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు

సీఏఏను వ్యతిరేకిస్తూ జీహెచ్‍ఎంసీలో టీఆర్‍ఎస్‍, మజ్లిస్‍  కలిసి తీర్మానం చేశాయని, సీఏఏ ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ ఆలోచించడం లేదని కిషన్​రెడ్డి విమర్శించారు. పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు ఓ పక్క అసదుద్దీన్‍  ఒవైసీని, మరో పక్క అక్బరుద్దీన్​ ఒవైసీని కూర్చోబెట్టుకొనే కేసీఆర్​కు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.  భైంసాలో ఇండ్లు తగలబెట్టారని, కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారని, దీనికి కారణం మజ్లిస్‍  పార్టీ అని, ఆ పార్టీకి అండగా ఉన్నది టీఆర్‍ఎస్‍  పార్టీ అని కిషన్​రెడ్డి ఆరోపించారు. భైంసా మున్సిపల్​ చైర్మన్​ సీటును మజ్లిస్‍  పార్టీ దక్కించుకోవడానికి కేసీఆరే కారణమని దుయ్యబట్టారు.

నిధులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం  

రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని ఓర్వలేక, నిజామాబాద్‍ లో తన చెల్లెలు ఓడిపోవడాన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని  కిషన్​రెడ్డి విమర్శించారు.  కేంద్రం ఏ రాష్ట్రంపైన కూడా వివక్ష చూపడం లేదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుంటే.. నిధులు ఇవ్వడం లేదంటూ కేటీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం 28 రూపాయలు ఇస్తోందని తెలిపారు. ‘ఇది కేంద్ర సాయం కాదా.. ఇది కేసీఆర్‍, కేటీఆర్‍కు కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70ఏండ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జాతీయ రహదారుల కంటే మోడీ హయాంలో ఈ ఐదున్నరేండ్లలో అత్యధికంగా జాతీయ రహదారులు వచ్చాయని వివరించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు డబుల్​ బెడ్‍రూం ఇండ్లు ఇవ్వడం లేదని, ఆరోగ్య శ్రీకి తూట్లు పొడుస్తోందని, ఫీజు రీయింబర్స్​మెంట్​ను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్‍ఎస్‍  నిలబెట్టుకోవడం లేదని, కేవలం కుటుంబ పాలన సాగిస్తోందన్నారు.

భైంసా బాధితులకు సాయం

భైంసా, వెలుగు: భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, ఎంపీలు ధర్మపురి అర్వింద్​, బండి సంజయ్​ అండగా నిలిచారు. ఆదివారం బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వీరు ఆర్థిక సాయం ప్రకటించారు. కిషన్​రెడ్డి తన మూడు నెలల జీతం ఇస్తానన్నారు. లక్ష్మణ్​ రూ. 10లక్షలు, అర్వింద్​  రూ. 5లక్షలు,  సంజయ్​ రూ. 5లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పరంగా మరింత ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం