పాతబస్తీ మజ్లిస్​దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం

పాతబస్తీ మజ్లిస్​దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం
  • మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి

హైదరాబాద్‌, వెలుగు :  పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్డ్‌ సిటీలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెగ్యులర్‌‌గా పోటీ చేసే ఏడు స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. మొత్తం 9 సీట్లల్లో ఏడు స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. పాత సీట్లు చార్మినార్, యాకుత్‌పురా,​ బహదూర్‌‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలైంది. నాంపల్లి, యాకుత్‌పురా స్థానాల్లో ప్రత్యర్థుల నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ ఎదురైంది. ఒకనొక సందర్భంలో ఈ స్థానాల్లో పార్టీ ఓడిపోనుందా అనేలా టెన్షన్‌ నెలకొంది.

నాంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహమ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌.. మాజీ మేయర్, ఎంఐఎం అభ్యర్థి మజీద్‌ హుస్సేన్‌కు గట్టిపోటీ ఇచ్చారు. కేవలం 3,249 మెజార్టీతో మజీద్‌ గెలుపొందారు. అలాగే, యాకుత్‌పురాలో కూడా స్వల్ప మెజార్టీతో ఎంఐఎం బయటపడింది. అక్కడ మజ్లిస్‌ అభ్యర్థి జాఫర్‌‌ హుస్సేన్‌కు ఎంబీటీ అభ్యర్థి అంజాద్‌ ఉల్లాఖాన్‌ గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 878 మెజార్టీతో జాఫర్‌‌ గెలుపొందారు. కాగా, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో మజ్లిస్‌ పోటీ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పడినట్లయింది. ఫలితంగా రాజేంద్రనగర్‌‌లో ప్రకాశ్‌ రెడ్డి, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌ గెలుపునకు మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు మైనార్టీ ఓట్లు చీల్చడమే కారణమని పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. కార్వాన్‌లో బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్‌ నుంచి గట్టి పోటీ ఇవ్గా, చివరకు మజ్లిస్‌ అభ్యర్థి కౌసర్‌ మొహినోద్దీన్‌ విజయం సాధించారు. బహదూర్‌పుర అభ్యర్థి ముబీన్‌ 67,025 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌తో పాటు మలక్‌పేట్‌లో అహ్మద్‌ బలాలా చార్మినార్‌ అభ్యర్థి ఎంసీహెచ్‌ మాజీ మేరకు మీర్‌ జుల్ఫీకర్‌ అలీ విజయం సాధించారు. కాగా, ఈసారి ఏడు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ గతంతో పోలిస్తే ఈసారి ఎంఐఎం కు భారీగా ఓట్లు తగ్గాయి.