
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటుపై గెలుపు ధీమా ఉన్నప్పటికీ లోలోపల ఆందోళన పడుతున్నది. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ను ఎన్నడూ సీరియస్‌గా తీసుకోని ఆ పార్టీ నేతలు.. ఈసారి కొంత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బస్తీల్లో ఒవైసీ బ్రదర్స్ ప్రచారం చేశారు. ప్రతీ ఇంటి తలుపు తట్టి మజ్లిస్ పార్టీకి ఓటేయాలని కోరారు. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గెలుపుపై ధీమాతో ఉన్నది.
హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ మొదటి సారి మహిళా అభ్యర్థి మాధవీలతను రంగంలోకి దించడంతో పరిస్థితి మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ క్యాండిడేట్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లు అంటూ మాధవీలత పలువురు మహిళల హిజాబ్ తొలగించడం వివాదాస్పదమైంది. మజ్లిస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది.
రాష్ట్రంలో ఇక్కడే తగ్గిన పోలింగ్ శాతం
40 ఏండ్లుగా పాతబస్తీ పార్లమెంట్‌పై పతంగ్ ఎగురవేస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీ.. మొదటి సారిగా టఫ్ ఫైట్‌గా భావించినట్లు కనిపించింది. ఈ సెగ్మెంట్ పరిధిలో గతంలో ఇతర పార్టీ అభ్యర్థులు ఇక్కడ కనీసం ప్రచారం చేసుకునే పరిస్థితులు కనిపించలేదు. దీంతో మజ్లిస్ పార్టీ హవా నాలుగు దశాబ్దాలుగా కొనసాగింది. ఓటింగ్ లేట్‌గా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం వరకు 25శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు.
చివరికి కొంత మేర పెరిగినా రాష్ట్రంలో ఇక్కడే తక్కువ పోలింగ్ శాతం రికార్డయింది. మరోవైపు మహిళల ఓట్లు ఎటు అనేది అంతు పట్టకుండా ఉండడంతో మజ్లిస్ పార్టీ టఫ్ ఫైట్‌గా భావించింది. అయితే, గెలుపుపై మాత్రం ఆ పార్టీ ధీమాగా ఉన్నట్టు తెలుస్తున్నది.