- మైనార్టీ ఓట్లు తీసేస్తున్నారన్న అక్బరుద్దీన్
- సంబంధం లేని సబ్జెక్ట్‌పై అక్బర్ ఎలా మాట్లాడతారని ఏలేటి ఫైర్
- స్పీకర్ ఎందుకు మైక్ కట్ చేయడం లేదని గుస్సా
- మంత్రి శ్రీధర్ బాబు జోక్యంతో సద్దుమణిగిన వాగ్వాదం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వేదికగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంశంపై మజ్లిస్, బీజేపీ మధ్య మంగళవారం మాటల యుద్ధానికి దారితీసింది. మైనార్టీ ఓట్ల తొలగింపు అంశాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించగా.. బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్‌పై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారు. బిహార్, బెంగాల్లో సర్ పేరుతో ఇష్టానుసారంగా మైనార్టీల ఓట్లు తొలగించారు.
ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుందేమోనన్న అనుమానం కలుగుతున్నది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించొద్దు. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వంటి సమస్యలతో ఓటర్లను చేర్చకుండా నిరాకరించడం సరికాదు. ఈ ప్రక్రియలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు చూపించలేకపోతున్నరు. దీంతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నరు’’అని అక్బరుద్దీన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు.
తర్వాత మళ్లీ అక్బరుద్దీన్ కలగజేసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం తెలపడంపై ఆయన నిలదీశారు. సర్‌పై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అక్బరుద్దీన్ కామెంట్లను ఆయన ఖండించారు.
అక్బర్‌ను ఎందుకు ఆపట్లేదు?: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
అసెంబ్లీలో చర్చ దేనిపై జరుగుతుందని, ఆయన ఏం మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్అయ్యారు. సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల అంశాలను ప్రస్తావిస్తూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అయినా స్పీకర్ ఎందుకు వారించడం లేదన్నారు. ‘‘సర్ మీద మాట్లాడమంటే.. ఆయన రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే స్పీకర్ ఎందుకు ఆపడం లేదు? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి. బోగస్ ఓట్ల అంశంపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలి. రోహింగ్యాలు, అక్రమ ఓట్లపై చర్చ జరగాల్సిందే’’అని మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు.
సర్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నం: మంత్రి శ్రీధర్ బాబు
అసెంబ్లీలో బీజీపీ ఎమ్మెల్యేలు, అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు చేసుకునే స్థాయికి వెళ్లింది. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని.. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయొద్దని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ఈసీ పరిధిలోని అంశమని, ఇందులో ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరిస్తున్నదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సర్‌పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మహేశ్వర్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు.
