జమ్మూ మున్సిపల్ కమిషన్ వెబ్‌సైట్‌‎పై సైబర్ ఎటాక్.. కీలక ఫైల్స్ మాయం..!

జమ్మూ మున్సిపల్ కమిషన్ వెబ్‌సైట్‌‎పై సైబర్ ఎటాక్.. కీలక ఫైల్స్ మాయం..!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్-భారత్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్‎లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ మున్సిపల్ కమిషన్ వెబ్‌సైట్‌పై శుక్రవారం (మే 2) భారీ సైబర్ దాడి జరిగింది. మున్సిపల్ కమిషన్ వెబ్‌సైట్‌‎లోకి దూరిన హ్యాకర్లు.. కీలకమైన డేటాను దొంగిలించారని ఉన్నత నిఘా వర్గాలు వెల్లడించాయి. కీలకమైన సర్టిఫికెట్లు తస్కరించినట్లు అధికారులు తెలిపారు. 

వెంటనే అప్రమత్తమైన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి ఏజెన్సీలు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాయి. సైట్ పునరుద్ధరించే వరకు అన్ని పనులను నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది పాక్ ప్రేరేపిత హ్యాకర్ల పనేనని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాడి అనంతరం హ్యాకర్లు పలుమార్లు భారత్, జమ్మూ ప్రభుత్వాల వైబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. 

►ALSO READ | భారత్కు మీరైనా చెప్పండి.. యుద్ధ భయంతో వణికిపోతూ ట్రంప్ను ఆశ్రయించిన పాక్

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మరణించారు. ఈ దాడి వెనక పాక్ హస్తం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై ఆగ్రహంగా ఉంది. పాక్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందం రద్దు, పాక్ పౌరులకు వీసాల రద్దు, పాక్ విమానాలకు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వంటి ఆంక్షలు విధించింది.