
హైదరాబాద్: సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం (జూలై 17) తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో డ్యూరోడైన్ ఇండస్ట్రీస్ అనే పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. 6 ఫైరింజన్లు, ఒక రోబోట్ మిషన్ సహాయంతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది.
అగ్ని ప్రమాదానికి గురైన డ్యూరోడైన్ పరిశ్రమలో ప్లాస్టిక్ ప్లేట్స్, డిన్నర్ ప్యాకింగ్ సెట్స్ తయారు చేస్తారు. కంపెనీలోని ప్లాస్టిక్ వస్తువుల ధాటికి మంటలు ఇంకా ఎక్కువ చెలరేగాయి. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.