కొనసాగుతున్న సస్పెన్స్.. ఎవరికి టికెట్లు ఇస్తారనే దానిపై కొరవడిన స్పష్టత

కొనసాగుతున్న సస్పెన్స్.. ఎవరికి టికెట్లు ఇస్తారనే  దానిపై కొరవడిన స్పష్టత
  • ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేయనున్న ప్రధాన పార్టీలు 
  • ఈ నెల 3 వరకు బీపాం ఇచ్చేందుకు సమయం 
  • గెలుపు అభ్యర్థులకే టికెట్లు ఇచ్చేలా ప్లాన్ 
  • రెబల్స్ ను బుజ్జగిస్తున్న ఆయా పార్టీ నేతలు 

నల్గొండ, యాదాద్రి/ వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ ప్రక్రియలో చివరి రోజున వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో టికెట్లపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఆశావాహులు ముందుజాగ్రత్తగా నామినేషన్లు వేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతులకు పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో, అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని ఒక కార్పొరేషన్, 11 మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది.

విజయమే లక్ష్యంగా అడుగులు.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు అందించగా, చిట్యాల, మిర్యాలగూడ, తిరుమలగిరి, హాలియా, నందికొండ, చండూరు మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులను ప్రకటించారు. అయితే సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల వంటి మున్సిపాలిటీల్లో ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తికాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల 3వ తేదీ వరకు బీఫాం ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని పార్టీలు భావిస్తున్నాయి.

సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక 

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు ప్రైవేటు సంస్థలతో పాటు పార్టీ అంతర్గత సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్నవారికే టికెట్లు కేటాయించనుంది. రెబల్స్ బెడద తలెత్తకుండా ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట మున్సిపాలిటీ లో  అధికార పార్టీ నుంచి చైర్మన్ పదవి ఆశిస్తున్న ప్రముఖ డాక్టర్ నామినేషన్ వేయగా.. ఆయనను ఎలాగైనా పోటీలో ఉండకుండా హైదరాబాద్ నుంచి పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.   

తిరుగుబాటు భయంతో అభ్యర్థుల లిస్టు విడుదల చేయలే..   

యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు ఉండగా, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా తుది దశలో ఉంది. చౌటుప్పల్, మోత్కూరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేసినా తిరుగుబాటు భయంతో లిస్టులు విడుదల చేయలేదు. మోత్కూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో బీఆర్‌ఎస్ ఆ దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎస్సీ మహిళ అభ్యర్థులతో జనరల్ వార్డుల్లోనూ నామినేషన్లు వేయించింది.  చౌటుప్పల్​ మున్సిపాలిటీ చైర్మన్​ జనరల్​ మహిళకు రిజర్వ్​ అయింది. 

దీంతో కాంగ్రెస్​ తరపున చైర్మన్​ పదవి ఆశిస్తున్న వెన్​ రెడ్డి సంధ్య తొలుత ఏడో వార్డులో నామినేషన్​ వేయగా బత్తుల వాణి 13 వ వార్డులో నామినేషన్​ వేశారు. ఆ తర్వాత వెన్​ రెడ్డి సంధ్య 16 వార్డులోనూ నామినేషన్​ వేయడంతో బత్తుల వాణితో 16వ వార్డులోనూ నామినేషన్​ వేయించారు. చైర్మన్​ పదవి ఆశిస్తున్న ఇద్దరు ఆశావహులు రెండ్రెండు వార్డుల్లో నామినేషన్​ వేయడంతో ఒకరు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

భువనగిరి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్‌లో పోటీ

భువనగిరి మున్సిపల్ చైర్మన్ సీటుపై కాంగ్రెస్‌లో పోటీ తీవ్రమైంది. సీనియర్ నాయకులు తంగెళ్లిపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు తమ భార్యలతో వేర్వేరు వార్డుల్లో నామినేషన్లు వేయించగా, వారి మధ్య సయోధ్య కుదర్చేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. మరోవైపు భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ సీపీఐతో పొత్తు కుదుర్చుకొని 10వ వార్డును కేటాయించగా, సీపీఎంకు ఇప్పటికే 6వ వార్డు ఇచ్చింది. రెండు వార్డులు పోనూ మిగిలిన 33 వార్డుల్లో బీఆర్​ఎస్​ పోటీ చేస్తోంది. నాలుగు వార్డులు మినహా 29 వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

 ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నామినేషన్ ర్యాలీలు పోటాపోటీగా సాగాయి. కాంగ్రెస్ తరపున ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.