స్థానిక పోరుకు సన్నద్ధం..బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు సేకరిస్తున్న ప్రధాన పార్టీలు

స్థానిక పోరుకు సన్నద్ధం..బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు సేకరిస్తున్న ప్రధాన పార్టీలు
  • ఆశావాహుల లిస్టు రెడీ చేయాలని సూచన
  • నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్లాన్​
  • ఒక్కో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి నాలుగైదు పేర్లు ప్రతిపాదన 

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న లీడర్లతో పాటు, బలంగా ఉన్న వారి పేర్లను సేకరిస్తూ లిస్టులు రెడీ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా  అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలకు పార్టీ అధిష్టానం సూచనలు చేసింది. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల లిస్టు తయారీలో నిమగ్నమయ్యాయి.

 ఇప్పటికే కొన్ని లిస్టులు సిద్ధం చేసి ముఖ్య నేతలకు పంపారు. బీఆర్‌‌‌‌ఎస్ మండలాల వారీగా లిస్టులను రెడీ చేస్తోంది.  సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు. బీజేపీ తరఫున పోటీలో ఉండే వారికి గ్రౌండ్‌‌‌‌వర్క్ చేయాలని సూచనలు చేస్తున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌‌‌‌ తరఫున  పోటీ చేయాలనుకునే వారు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కో స్థానానికి నలుగురు, ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తున్నారు. బరిలో ఉండే అభ్యర్థులపై కార్యకర్తల అభిప్రాయాలనూ తీసుకోనున్నారు. పట్టణాల్లో కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు కూడా గ్రౌండ్‌‌‌‌వర్క్ చేస్తున్నారు.

జిల్లాలో..

జిల్లాలో 25 జడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు, 530 పంచాయతీలు ఉన్నాయి. వీటి గడువు ముగిసినా ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీనిపై అమోదం రావాల్సి ఉంది. 

సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రకటనకు అవకాశముందని నేతలు భావిస్తున్నారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందుగా ఏ ఎన్నికలు జరుగుతాయో ఇంకా స్పష్టత లేదు. పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి.

కాంగ్రెస్..

జిల్లాలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉండటం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలవుతుండటం వల్ల పార్టీకి ఇది ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలిసే ప్రయత్నంలో ఆశావాహులు చురుకుగా తిరుగుతున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం గ్రామ, మండలస్థాయి కమిటీలను బలోపేతం చేయాలని సూచిస్తోంది.

బీఆర్‌‌‌‌ఎస్..

బీఆర్‌‌‌‌ఎస్ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల పేర్లను నియోజకవర్గాల వారీగా లిస్టులు పంపాలని ఆదేశించింది. మండలాల ముఖ్య నేతలు సమావేశమై లిస్టులు తయారు చేస్తున్నారు. కామారెడ్డిలో ఇప్పటికే లిస్టు సిద్ధమైంది. ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో లిస్టులు ప్రిపేర్ చేస్తున్నారు. సాధారణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటల వారీగా వర్గీకరణ చేస్తున్నారు.

బీజేపీ..

బీజేపీ కూడా లోకల్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో మండలాల వారీగా వివరాలు సేకరించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి విజయం సాధించడంతో ఈసారి స్థానిక ఎన్నికల్లోనూ అధిక స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తిగల వారి వివరాలు సేకరిస్తున్నారు.