అల్లూరి సీతారామరాజు జిల్లా: అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా మారేడుమిల్లి తులసి పాకల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదానికి గురైన బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. చింతూరు పోలీసులు స్పాట్కు చేరుకుని ఈ ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం.. పొగ మంచు కమ్మేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తు్న్నారు. ప్రమాద స్థలానికి వెంటనే చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అడవి ప్రాంతం కావడంతో రెస్క్యూ కష్టంగా మారింది. క్రేన్‌లు, వ్యాలీ రెస్క్యూ టీమ్స్ సహాయంతో మృతదేహాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డు ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

