సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలు మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలు మూసివేత

చంద్రగ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ

నెట్​వర్క్​, వెలుగు: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా  రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నింటినీ మంగళవారం మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:37 గంటలకు మొదలయ్యే  చంద్రగ్రహణం .. సాయంత్రం 6:19 గంటలకు ముగియనుంది.  గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి ఆలయాలు తెరవనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు దర్శనాలను పునరుద్ధరిస్తారు. గ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో  సహా ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను  మంగళవారం ఉదయం 3 గంటలకే  తెరిచి నిత్య పూజలు  జరపనున్నారు. ఉదయం 8:15 గంటల లోపు పూజలు ముగించి ఆలయాన్ని బంద్ చేస్తారు. రాత్రి 8 గంటలకు  ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం తదితర పూజలను చేస్తారు. రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేయనున్నారు.  బుధవారం  నుంచి  నిత్య పూజలు, దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

రాజన్న ఆలయం మూసివేత

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  ఉదయం 5:38 గంటలకు ప్రాతకాల పూజలు చేసిన అనంతరం ప్రధాన ఆలయంతో పాటు, అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 6-.30 గంటలకు ఆలయాన్ని తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ చేసి  రాత్రి 8 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.