కాలం చెల్లిన క్వార్టర్లు

కాలం చెల్లిన క్వార్టర్లు

మందమర్రి, వెలుగు: సింగరేణిలో మెజార్టీ  క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. 40 ఏళ్ల కిందట సింగరేణిలో డి, స్పెషల్​ డి, టీ2 పేర్లతో క్వార్టర్లను నిర్మించారు. 35 నుంచి 40 చదరపు గజాల స్థలంలో రెండు రూమ్​లు, కిచెన్​తో నిర్మించిన ఈ ఇండ్లు కార్మికులు భార్యాపిల్లలతో నివసించడానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. కార్మికులతోపాటు వారి తల్లిదండ్రులుంటే మరింత కష్టమవుతోంది. ప్రధానంగా బెల్లంపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మందమర్రి ప్రాంతాల్లో ఎంసీ, స్పెషల్​ డీ, సీ2, డి టైప్​, టీ2 టైప్​క్వార్టర్లు 51,964 నిర్మించారు. ఇందులో అరకొర వసతులతో సుమారు 30 వేల వరకు మాత్రమే బాగున్నాయి.  సింగరేణిలో 43 వేల మంది ఎంప్లాయీస్​ ఉన్నారు. ఇటీవల కొత్తగా జైపూర్​ ఎస్టీపీపీలో 132 క్వార్టర్లు నిర్మించగా, భూపాలపల్లి ఏరియాలో 994, సత్తుపల్లిలో 353 నిర్మాణంలో ఉన్నాయి. 

రిపేర్ల సంగతే మరిచిన్రు
శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల రిపేర్ల సంగతే సింగరేణి మరిచిపోయింది. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగైనప్పటికి ఆ మేరకు క్వార్టర్లలో సౌలతుల్లేవు. డి, స్పెషల్​డి, టీ2 క్వార్టర్లు చాలావరకు శిథిలావస్థకు చేరాయి. క్వార్టర్ల పైకప్పు నుంచి నీరు కారటం, నీటి చెమ్మ దిగటం, సరైన వెంటిలేషన్​లేకపోవడం, అస్తవ్యస్తమైన  డ్రైనేజీ వ్యవస్థ, గోడలు భూమిలోకి కుంగిపోవడం, పైకప్పు కూలడం,  హౌజ్​వైరింగ్, తలుపులు, కిటికీలు దెబ్బతినడం తదితర సమస్యలున్నాయి. దశాబ్దం కింద నిర్మించిన ఎంసీ, సీ2 మినహా మిగిలిన ఇండ్లు ఉండేందుకు అనుకూలంగా లేకపోవడంతో వాటిని తీసుకునేందుకు ఎంప్లాయీస్​ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు హౌజ్​రెంట్​అలవెన్స్​ చెల్లించాల్సి వస్తోందని యాజమాన్యం బాగాలేని క్వార్టర్లను  బలవంతంగా ఎంప్లాయీస్​కు కట్టబెడుతోంది. బాగున్న క్వార్టర్లలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సింగరేణికి సంబంధం లేని వ్యక్తులు అక్రమంగా నివాసముంటున్నారు. ఖాళీగా ఉన్న క్వార్టర్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. 

సీఎం చెప్పినా ఒక్కటీ కట్టలే..
1980కి ముందు కట్టిన క్వార్టర్లు సక్రమంగా లేవని, డబ్బాల్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పదివేల క్వార్టర్లు కట్టాలని సీఎం కేసీఆర్​ ఫిబ్రవరి 27, 2018లో శ్రీరాంపూర్​లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో సింగరేణి యాజమాన్యానికి సూచించారు. సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లు  దాటినా ఇప్పటి వరకు బెల్లంపల్లి రీజియన్​లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో కొత్త ఇండ్ల నిర్మాణం మాత్రం షురూ కాలేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. 

For more news..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర ... బీజేపీ నేత వార్నింగ్