పోడు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: మంత్రి సత్యవతి

పోడు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: మంత్రి సత్యవతి
  • ఆఫీసర్లను ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్​ 

మహబూబాబాద్, వెలుగు: అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయం చేస్తున్నవారికి న్యాయం చేయడం, అటవీ భూమిని పరిరక్షించేందుకు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మంగళవారం కలెక్టర్ ఆఫీస్​లో పోడు పట్టాలు, మన ఊరు – మనబడి, కంటి వెలుగు ప్రోగ్రాంలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో  పోడు పట్టాలు పంపిణీ చేయనున్నందున ఆఫీసర్లు  ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోడు రైతుల క్లైములను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. కంటి వెలుగుపై  గ్రామాల్లో విస్తృత ప్రచారం  చేయించాలన్నారు.

కురవిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరం ప్రజలకు ఆర్థిక భారం తగ్గిస్తున్నందున బయ్యారంలోను శిబిరం ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన ఊరు మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయినందున ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, అందులో భాగంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు బ్రేక్ ఫాస్ట్​ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, డీఎఫ్​వో రవికిరణ్, అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, డీఎంఅండ్​హెచ్​వో హరీశ్ రాజ్, డీఈవో రామారావు, ట్రైబల్​వెల్ఫేర్​డీడీ ఎర్రయ్య, ఆర్డీవో కొమరయ్య 
తదితరులు పాల్గొన్నారు.