గణేశ్ నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

గణేశ్ నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

హైదరాబాద్, వెలుగు: గణేశ్ నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మితో కలిసి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. విగ్రహాల నిమజ్జనం కోసం ఇప్పటికే ఉన్న 25 పాండ్స్ కు అదనంగా మరో 50 పాండ్స్ నిర్మించినట్లు వెల్లడించారు. శోభాయాత్ర కొనసాగే రూట్లలో అవసరమైన చోట్ల రిపేర్లు చేస్తున్నట్లు తెలిపారు.

నిమజ్జనం చేసే ప్రాంతాల్లో క్రేన్లు, ప్రత్యేక లైటింగ్, జనరేటర్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నుంచి లక్ష, హెచ్ఎండీఏ తరఫున లక్ష విగ్రహాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 9న జరిగే గణేశ్​నిమజ్జనం నాడు 8 వేల మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించారు.

సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పీసీబీ సెక్రెటరీ నీతూ కుమారి ప్రసాద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్​భగవత్, స్టీఫెన్ రవీంద్ర, భాగ్యనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ గణేశ్​ఉత్సవ సమితి ప్రతినిధులు  పాల్గొన్నారు.