గోబీ మంచూరియా చేయడం ఇంత సింపులా.. జస్ట్ 20 నిమిషాలలో ఇలా ప్రిపేర్ చేయండి..!

గోబీ మంచూరియా చేయడం ఇంత సింపులా.. జస్ట్ 20 నిమిషాలలో ఇలా ప్రిపేర్ చేయండి..!

శాఖాహారులకు మాంసాన్ని మించిన రుచి కలిగిస్తూ.. మాంసాహారులను కూడా ఆకర్శించే డిష్ ఏదైనా ఉందంటే అది గోబీ మంచూరియానే. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లా అనిపించే ఈ వంటకాన్ని స్వచ్ఛమైన లోకల్ స్టైల్ లో ప్రిపేర్ చేసుకుని తింటుంటే ఆ టేస్టే వేరు. కొన్నిసార్లు నాన్ వెజ్ అక్కర్లేదు అనిపించడం పక్కా. 

ఇంట్లో ఎందుకు రిస్క్.. అలా వెళ్లి ఓ హండ్రెడ్ గ్రామ్ తెచ్చుకునేదానికి అని అనుకుంటారు చాలా మంది. కానీ.. బయట మళ్లీ మళ్లీ మరిగించిన ఆయిల్ లో చేసిన దానికంటే.. ఎంచక్కా మనమే ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా.  కేవలం 20 నిమిషాల్లో ఈ టేస్టీ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన ఇంగ్రీడియెంట్స్:

  • అరకేజీ గోబీ (క్యాలిఫ్లవర్)
  • మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్
  • మూడు మీడియం సైజులో ఉన్న క్యాప్సికం.. గింజలు తీసి కట్ చేసి పక్కన ఉంచండి
  • ఒక ఉల్లిగడ్డ (ఆనియన్).. సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ ల టమాటో సాస్
  • ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్
  • చిటికెడ్ అజినిమోటో (టేస్ట్ కొరకు)
  • ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
  • అర టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్
  • ఒక టేబుల్ స్పూన్ కారం పొడి
  • ఉప్పు సరిపడినంత.. ఒకటిన్నర స్పూన్
  • క్యాలిఫ్లవర్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్.. అలాగే సాస్ ఫ్రై చేయడానికి మూడు స్పూన్లు
  • కొత్తిమీర సరిపడినంత

ప్రిపేర్ చేసే విధానం:

ముందుగా క్యాలిఫ్లవర్ ను కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టాలి. మరో  బౌల్ తీసుకుని క్యాలిఫ్లవర్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం పోడిని మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం క్యాలిఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. 

ఒక కడాయిలో మీడియం ఫ్లేమ్ లో నూనె వేడి చేయాలి. కార్న్ ఫ్లోర్ పట్టించిన క్యాలిఫ్లవర్ ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ముక్కలను పేపర్ ఉంచి ప్లేట్ లో వేసి కాసేపు ఆరే వరకు పక్కనపెట్టాలి. 

సాస్ పాన్ లేదా కడాయి లో మూడు టేబుల్ స్పూన్ ల నూనె వేడి చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ లో వేడి చేయాలి. ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఆనియన్స్ ట్రాన్స్ పరెన్సీ కలర్ వచ్చే వరకు 2 లేదా మూడు నిమిషాలు ఫ్రై చేయాలి.  ఆ తర్వాత టమాటో, చిల్లీ సాస్ లను యాడ్ చేయాలి. అజినిమోటో కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేయాలి. 

ఆ వెంటనే డీప్ గా ఫ్రై చేసి పక్కన పెట్టిన క్యాలిఫ్లవర్ ముక్కలను వేసి మీడియం హీట్ లో రెండు నిమిషాలు  వేగనివ్వాలి. ఆ తర్వాత తరగి పెట్టుకున్న కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే.. భలే రుచిగా ఉంటుంది. దీన్ని ఫ్రైడ్ రైస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.