Pawan Kalyan: "ఉస్తాద్ భగత్‌సింగ్" హంగామా షురూ.. మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ మ్యాజిక్!

Pawan Kalyan: "ఉస్తాద్ భగత్‌సింగ్" హంగామా షురూ.. మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ మ్యాజిక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) సందడి మొదలైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మొట్టమొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రబృందం లేటెస్ట్ గా ఒక అదిరిపోయే స్పెషల్ మేకింగ్ వీడియోను పంచుకుంది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పవన్ ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

 మేకింగ్ వీడియోలో మ్యాజిక్

తాజాగా విడుదలైన ఈ మేకింగ్ వీడియో అభిమానులకు ఒక ట్రీట్‌లా ఉంది. ఈ క్లిప్‌లో పవన్ కల్యాణ్ తనదైన స్టైల్‌లో స్టెప్పులేస్తూ, సెట్‌లో ఉల్లాసంగా నవ్వుతూ కనిపించారు. షూటింగ్ ఎంత సరదాగా సాగుతుందో, పాటలో పవన్ ఎనర్జీ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఆయన డ్యాన్స్‌లో కనిపించిన ఫ్లెక్సిబిలిటీ, ఎనర్జీ చూస్తుంటే, బాక్సాఫీస్‌ వద్ద మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

 ఆ అంచనాలే వేరు!

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కు ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. దీనికి ప్రధాన కారణం.. బ్లాక్‌బస్టర్ సినిమా ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్ కల్యాణ్ , మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటమే. ఈ కాంబో అంటేనే మాస్ జాతర ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. హరీశ్ శంకర్.. పవన్‌ కల్యాణ్‌ను అత్యంత స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఈసారి కూడా ‘పవనిజం’ను పీక్స్‌లో చూపించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 భారీ బడ్జెట్‌తో నిర్మాణం

ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా యువ సంచలనం శ్రీలీల నటిస్తోంది. అలాగే, మరో ప్రధాన పాత్రలో అందాల తార రాశీఖన్నా కూడా కనిపించనుంది. వీరు ముగ్గురి కాంబినేషన్ తెరపై రచ్చ చేయనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, చిన్న గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.  ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి పనిచేస్తున్నారు.  మొత్తంగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ తొలి పాట కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో అతృతతో  భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.