
- తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్
ముషీరాబాద్, వెలుగు : బానిసత్వానికి, దోపిడీకి కారణమైన అధర్మ మనుస్మృతిని పునరుద్ధరించడానికి జరిగే ప్రయత్నాలను సహించబోమని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ హెచ్చరించారు. సోమవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన జేఏసీ నాయకులు.. మనుస్మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వాటి ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో హక్కులను పొందపరచారని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం కల్పించారన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 25న మనుస్మృతి దహన్ దివాస్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మద్దెల ప్రభాకర్, సత్యనారాయణ, నీరుడు మల్లేశ్, చింతపల్లి కాశీనాథ్, యాదగిరి, అందం, పరశురాం, కనకయ్య, స్వామిరాజ్ తదితరులు పాల్గొన్నారు.