
- దళిత ఎంపీని అవమానించిన వారిపై దండోరా మోగిస్తాం:మాదిగ హక్కుల దండోరా స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ మాదిగ
బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు దేవాదాయ శాఖ అధికారులు క్షమాపణ చెప్పాలని మాల మహానాడు జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరును ఫ్లెక్సీల్లో చేర్చకుండా అవమానించారని మండిపడ్డారు. మాల సామాజికవర్గానికి చెందిన ఎంపీ పేరును చేర్చకుండా అవమానించడం సిగ్గుచేటన్నారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను సైతం సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా అవమానించారని ఫైర్ అయ్యారు. దళిత సామాజికవర్గం అంటే మంత్రి శ్రీధర్ బాబుకు చులకన అని.. ఎంపీని అవమానించినందుకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు లింగాల అమృత, నాయకులు కాదాసి ప్రకాశ్, కంది రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.
జైపూర్‌లో ప్లకార్డులతో నిరసన
కోల్‌బెల్ట్, వెలుగు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై వివక్ష చూపిన వారిపై దండోరా మోగిస్తామని మాదిగ హక్కుల దండోరా స్టేట్ ప్రెసిడెంట్ రేగుంట సునీల్‌మాదిగ, జిల్లా వైస్ ప్రెసిడెంట్జలంపెల్లి బానేశ్ మాదిగ అన్నారు. ఎంపీని అవమానించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మాదిగ హక్కుల దండోరా లీడర్లు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. ఎంపీ వంశీకృష్ణ దళితుడనే ఉద్దేశంతోనే కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలు వద్ద ఆయన ఫ్లెక్సీలను అధికారులు పెట్టలేదని, ఇది దళిత జాతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ ఘటనకు మంత్రి శ్రీధర్‌బాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ఎంపీ వంశీకృష్ణకు మాదిగ హక్కుల దండోరా అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కడారి మల్లేశ్, లీడర్లు జలంపల్లి సంపత్ మాదిగ, సుందిల్ల కన్నయ్య, జలంపల్లి మల్లేశ్, రవి, జాడి సిద్ధు, మంతెని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.