
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ కులాల రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపి వేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా, నిర్దిష్టమైన డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టపోతున్నారని వెల్లడించారు. గ్రూప్–-3లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం జరుగుతుందని, రోస్టర్ విధానాన్ని సవరించి గ్రూప్–3లోని కులాలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా గ్రూప్–3కి కేటాయించలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్ర చేసిందో అర్థమవుతుందన్నారు.
మాల అనుబంధ కులాలకు 5% అవకాశాలు దక్కేలా రోస్టర్ పాయింట్లు సవరించేంత వరకు నోటిఫికేషన్లు నిలిపివేయాలన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన 15% విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాలలను 5 శాతానికి పరిమితం చేయడంతో పాటు 22, 41వ రోస్టర్ పాయింట్లు కేటాయించిదంటే ఉద్దేశపూర్వకంగానే మాలలను అణచివేసే కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందరావు, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.