మలక్పేట పరిధిలో పోలీసులమని చెప్పి.. రూ.50 లక్షలతో పరారీ

మలక్పేట పరిధిలో పోలీసులమని చెప్పి.. రూ.50 లక్షలతో పరారీ
  • మలక్​పేట పరిధిలో ఘటన
  • బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

మలక్ పేట, వెలుగు: పోలీసులమని చెప్పి ఓ ట్రస్టు నిర్వాహకుడి నుంచి రూ.50 లక్షలతో దుండగులు ఉడాయించారు. మలక్​పేట ఇన్​స్పెక్టర్ నరేశ్ వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన విజయ్​కుమార్ (36) సేవారత్ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. రవీందర్, అశోశ్ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఒక కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకొని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద రూ.కోటి జమ చేస్తామన్నారు. దానికి బదులుగా రూ.50 లక్షలు ఇవ్వాలని చెప్పారు. విజయ్‌కుమార్ వారి మాటలు నమ్మి అంగీకరించాడు. 

అనంతరం సోను, నవీన్ అనే ఇద్దరితో డబ్బులు పంపిస్తామని చెప్పి వెళ్లారు. శుక్రవారం రాత్రి విజయ్‌కుమార్ ముసారాంబాగ్​లో తన బంధువు రామచంద్రయ్య ఇంట్లో సోను, నవీన్​తో సమావేశమయ్యాడు. రూ.50 లక్షల తన నగదును రెండు బ్యాగుల్లో ఉంచి వారితో మాట్లాడుతుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి, నగదుతో పాటు సోను, నవీన్​ను తీసుకెళ్లారు. అనంతరం మోసపోయినట్లు గుర్తించిన విజయ్​కుమార్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.