మాలలు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలి : వివేక్ వెంకటస్వామి

మాలలు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలి : వివేక్ వెంకటస్వామి

సత్తుపల్లి, వెలుగు: మాలలు ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో వారు వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. మాలలు ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు సీనియర్ నాయకులు పిల్లి సర్వేశ్వరరావు మాట్లాడుతూ 1984లో తాను మొదలుపెట్టిన మాల మహానాడు కార్యక్రమం నేటికీ తెలుగు రాష్ట్రాలలో కొనసాగటం చాలా ఆనందంగా ఉందన్నారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఆర్ఎస్ నేత మట్ట దయానంద్, రాగమయి దంపతులు నిరుపేద మాల విద్యార్థుల అభ్యున్నతి నిధికి రూ.50 వేలు ప్రకటించారు. పీసీసీ అధికార ప్రతినిధి కోటూరు మానవతారాయ్, పే బ్యాక్ టు సొసైటీ ఫౌండర్ జంగం లక్ష్మణ్, మాల మహానాడు నాయకులు గొంతేటి వీరభద్రం, మత్త మాల ప్రసాద్, కవులు, రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. కులసంఘానికి అన్నివేళల్లో అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేందుకు ముందుంటామని తెలిపారు. నిరుపేద మాల విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా తమ వంతు తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవులు, రచయితలను జ్ఞాపిలకలతో సత్కరించారు.