బిస్కెట్ కింగ్ గా అలరించనున్న పృథ్వీరాజ్

బిస్కెట్ కింగ్ గా అలరించనున్న పృథ్వీరాజ్

ఒక మనిషి జీవితాన్ని తెరపై చూపించాలంటే రెండున్నర గంటల సినిమా సరిపోదు. అందుకే బయోపిక్స్ తీయాలనుకునే ఫిల్మ్ మేకర్స్ వెబ్‌‌ సిరీసుల వైపు వెళ్తున్నారు. పైగా కాంప్లికేటెడ్ విషయాలను కూడా డిటెయిల్డ్‌‌గా చూపించే స్వేచ్ఛ అక్కడ దొరుకుతోంది. అందుకే ఈ జానర్‌‌‌‌కి ఓటీటీలే బెస్ట్ అని నిర్ణయించుకుంటున్నారు. హర్షద్ మెహ్‌‌తా జీవితం ఆధారంగా వచ్చిన ‘స్కామ్ 1992’ లాంటి  సిరీసులు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఓ వెబ్ సిరీస్‌‌కి కమిటయ్యాడు. భారతదేశపు బిస్కెట్ కింగ్‌‌గా పేరొందిన రాజన్ పిళ్ళై జీవితం ఆధారంగా ఉంటుంది. పిళ్లైగా పృథ్విరాజ్ నటించబోతున్నాడు. తనే డైరెక్ట్ చేయబోతున్నాడు కూడా. ‘బిస్కెట్‌‌ కింగ్’ అనే టైటిల్‌‌నే ఫిక్స్ చేశారు. సరిగమ మ్యూజిక్ సంస్థకు చెందిన యూడ్లీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇదో ‘ఇన్‌‌స్పైరింగ్‌‌ ఫియర్‌‌‌‌లెస్ స్టోరీ’ అని చెబుతున్నారు. 

అంతర్జాతీయ స్థాయి ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు చేశాడనే ఆరోపణలతో 1995లో పిళ్లైని అరెస్ట్ చేసి, తీహార్ జైల్లో ఉంచారు పోలీసులు. పిళ్లై మెడికల్ ట్రీట్‌‌మెంట్‌‌ కోసం అప్పీల్ చేసుకుంటే కోర్టు ఒప్పుకుంది. కానీ ఉదయం హాస్పిటల్‌‌కి వెళ్లేలోపు జైల్లోనే చనిపోయారు పిళ్లై. లివర్ సిర్రోసిస్‌‌ కారణమని అన్నారు. కానీ భర్త మరణంపై పిళ్లై భార్య కోర్టుకు వెళ్లడం, సీబీఐ విచారణ లాంటివి చాలానే జరిగాయి. ఇప్పటికీ అది వీడని మిస్టరీనే. అంతేకాదు.. పిళ్లై జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించిన తీరు ఎంతోమందికి ఆదర్శం. అందుకే ఆయన లైఫ్‌‌ స్టోరీతో వెబ్‌‌ సిరీస్ చేయనున్నాడు పృథ్విరాజ్. 2001లో పిళ్లై తమ్ముడు రాజమోహన్, గోవిందన్ కుట్టితో కలిసి ‘ఎ వేస్టెడ్ డెత్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజన్ పిళ్లై’ పేరుతో ఓ బుక్ రాశారు. మరి పృథ్విరాజ్ సిరీస్ ఆ బుక్ ఆధారంగానే ఉంటుందా లేక ఇతర రిఫరెన్సులతో తీస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.